అవినీతి ముద్ర

30 Aug, 2018 10:24 IST|Sakshi

చేయి తడపందే పని కాదుఅత్యవసరమైతే మరీనుఏ సర్టిఫికెట్‌ కావాలన్నా లంచమే స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అవినీతి పెరుగుతున్న దళారీల ప్రమేయం

స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతి వేళ్లూనుకుంటోంది. రిజిస్ట్రేషన్‌ మొదలుకొని ఏం కావాలన్నా చేతులు తడపాల్సిందే. ఈసీలు, సీసీలు ఉచితంగా ఇవ్వాలనే నిబంధన ఉన్నా ముడుపులు చెల్లించుకోక తప్పడం లేదు. చుక్కలు, చిక్కులున్న సెటిల్మెంట్‌ భూములు, దేవాదాయ, డీకేటీ భూములే లక్ష్యంగా దళారుల చేతివాటంతో తప్పుడు రిజిస్ట్రేషన్‌లు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఇందుకు రిజిస్ట్రేషన్‌ శాఖకు రెవెన్యూ శాఖ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందనే ఆరోపణలున్నాయి.

చిత్తూరు, సాక్షి: జిల్లాలో తిరుపతి, చిత్తూరుల్లో జిల్లా రిజిస్ట్రారు కార్యాలయాలు ఉన్నాయి. ఇవి కాకుండా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు 25 ఉన్నాయి. వీటిలో ఎక్కువ అవినీతికి కేరాఫ్‌ అడ్రెస్‌గా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సంబంధించి మూల విలువపై 6.5 స్టాంపు సుంకం, 1 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇళ్లు, ఇళ్ల స్థలాల విషయంలో ఈ కార్యాలయాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు పెరుగుతున్నాయి. అత్యవసరమైతేæ అడిగినంత ఇస్తేనే పనులవుతాయనే వాదన  ప్రజల్లో నాటుకుపోయింది. ఈ కార్యాలయాల నుంచి ఈసీ లు, ఆర్‌హెచ్‌ నకళ్లు పొందడం పెద్ద సమస్యగా మారుతోంది. 

చుక్కల భూముల వ్యవహారాన్ని చక్కదిద్దే క్రమంలో రెవెన్యూ అధికారులు మేన్యువల్‌ ఈసీలు, హక్కు ధ్రువీకరణ పత్రాలను ప్రామాణికంగా చేశారు. ఇది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని సిబ్బందికి  అవకాశంగా మారింది. మేన్యువల్‌ ఈసీ, ఆర్‌హెచ్‌ నకలు తీసుకోవాలంటే కనీసం రూ.3 వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్యలతో కూడిన వ్యవహారం కావడంతో సకాలంలో రైతులకు ఈసీలు, ఆర్‌హెచ్‌లు సమకూర్చలేకపోతున్నారు. ఈసీకి రూ.520, ఆర్‌హెచ్‌ కాపీకి రూ.220 వరకు కలిపి వసూలు చేయాల్సి ఉండగా అవసరాల నేపథ్యంలో అడిగినంత ముట్టజె బుతున్నారు. 

రెవెన్యూ, రిజిస్ట్రార్‌ కుమ్మక్కు
పాకాల సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పరిధిలోని పాకాల, పెనుమూరు మండలాల్లో దేవాదాయ, డీకేటీ, సెటిల్మెంట్‌ భూములు యజమానుల ప్రమేయం లేకుం డానే 1బీ ఆధారంగా ఇతరులకు రిజిస్ట్రేషన్‌ జరిగిపోతున్నాయి. దీనికి అధికారపార్టీ నాయకులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. గ్రామాల్లో చుక్కలు, డీకేటీ భూములను గుర్తించి రెవెన్యూ అధికారుల సహకారంతో బినామీ పేర్లకు 1 బీ,  అడంగల్‌లో నమోదు చేస్తున్నారు. పత్రాలు లేకుండానే కేవలం 1బీ ఆధారంగానే ఇతరులకు విక్రయ రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం పెనుమూరు మండలం గుడ్యానంపల్లిలో అధికార పార్టీ నాయకుడు జయరామిరెడ్డి 70 ఎకరాలు డీకేటీ భూమిని బినామీ పేర్లతో ఆక్రమించుకున్నాడు. ఆన్‌లైన్‌ చేసుకున్నాడు. జెట్టిగుండ్లపల్లిలో కుంటస్థలాన్ని టీడీపీ నాయకులు అదే గ్రామానికి చెందిన ఓ మహిళ పేరుతో 1బీలో నమోదు చేశారు. రిజిస్ట్రేషన్‌ కూడా జరిగింది. ఆ స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ శాఖ సరైన ఆధారాలు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేస్తుండటంతో భూ యజమానులు వారి భూములపై పట్టు కోల్పోతున్నారు. ఆఖరుకు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. 

చిట్‌ల కంపెనీలతో కుమ్మక్కు..
రిజిస్ట్రేషన్‌ అధికారులు ప్రైవేటు చిట్‌ల కంపెనీలతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ సంస్థల  నుంచి ముడుపులు అందుతున్నాయని తెలు స్తోంది. దీనివల్లే ప్రై వేటు చిట్‌ కంపెనీలు నిబంధనలన్నీ ఉల్లంఘిస్తున్నా ఒక్క సంస్థపై కూడా చర్యలు తీసుకోలేదని విమర్శలున్నాయి.  నిబంధనల ప్రకారం చిట్‌లను తెరిచేటప్పుడే.. సభ్యుల జాబితా సమర్పించాలి. దీంతో పాటు చిట్‌లను ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయాలి. కంపెనీలు యథేచ్ఛగా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నా యి. చిట్‌ నిర్వహణలో ఖాతాదారుడు బయటికి వెళితే.. కొత్త ఖాతా దారుడిని చేర్చుకున్నా రిజిస్ట్రేషన్‌ శాఖకు తెలియజేయాలి. చిట్‌ కంపెనీలు ఇలాంటివేవి చేయడం లేదు. దీనిపై చర్యలు కూడా తీసుకోవడం లేదు. దీంతో చిట్‌ సంస్థ  ఖాతాదారులు నిండా మునిగిపోతున్నారు. 

పత్రాలతో మాకు పనిలేదు
భూముల రిజిస్ట్రేషన్‌ల సమయంలో పత్రాలతో మాకు పనిలేదు. కేవలం 1బి చూస్తాం. దీని ఆధారంగానే రిజిస్ట్రేషన్‌ చేయడం జరుగుతుంది. ఎవరి పేరున 1బీలో భూములు ఉంటే వారినే యజమానిగా రిజిస్ట్రేషన్‌ చేస్తాం. ఈసీ, ఓసీలు ఉచితంగానే అందిస్తున్నాం. ఎక్కడగాని డబ్బులు తీసుకోవడం లేదు. రిజిస్ట్రేషన్‌లో ఎవరైనా అవినీతికి పాల్పడినా, డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 
– రమేష్‌బాబు, డీఐజీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ 

మరిన్ని వార్తలు