అక్రమాల అడ్డా.. ట్రాన్స్‌కో కార్యాలయం

5 Feb, 2019 08:24 IST|Sakshi
కొండపి నుంచి కేవీపాలెం తరలిస్తున్న విద్యుత్‌ స్తంభాలు

ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్న కొండపి ఏఈ

ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.30 వేలు ముక్కుపిండి వసూలు

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ప్రతి వస్తువూ అమ్మకానికే..

కోట్ల రూపాయల గోల్‌మాల్‌ జరిగినట్లు ఆరోపణ

ట్రాన్స్‌ఫార్మర్లు మాయమైనట్లు  పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏడీఈ

ప్రకాశం, కొండపి: కొండపి ట్రాన్స్‌కో కార్యాలయం అక్రమాల అడ్డాగా మారింది. ఇక్కడి అధికారులు ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించారు. ఇక్కడి ఇంజినీరింగ్‌ అధికారి తన కార్యాలయాన్ని అక్రమ దందాకు అడ్డాగా మార్చుకున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా పని చేస్తున్న ఏఈ ప్రజలు, రైతుల విద్యుత్‌ అవసరాలను తనకు అనుకూలంగా మల్చుకున్నాడు. అడ్డగోలుగా తన కార్యాలయం సెక్షన్‌ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలు, కరెంటు తీగలను అడ్డగోలుగా అమ్మాకానికి పెట్టాడు. ట్రాన్స్‌ఫార్మర్‌ కావాల్సిన రైతులు ప్రభుత్వానికి రుసుం చెల్లించాల్సిన పనిలేదు. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆయనకు రూ.30 వేలు అందిస్తే ఆ రైతుకు ట్రాన్స్‌ఫార్మర్‌ ఇచ్చేలా  బహిరంగంగా ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. విద్యుత్‌ స్తంభాలను సైతం ఒక్కో స్తంభానికి వెయ్యి రూపాయలు చొప్పున తీసుకుని అవసరమైన వారికి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు.

ఐదేళ్లుగా కొండపి విద్యుత్‌ సెక్షన్‌లో ఏఈగా తిష్టవేసిన ఈ అధికారి వందల సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలు, తీగలు అమ్మటం ద్వారా రెండు కోట్ల రూపాయలకు పైగా అక్రమార్జన చేసినట్లు ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని పెట్లూరు, కోయవారిపాలెం, గుర్రప్పడియ, నెన్నూరుపాడు, అనకర్లపూడి తదితర గ్రామాలకు వెళ్లి చూస్తే అక్రమంగా ఏర్పాటు చేసిన అగ్రికల్చర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కనిపిస్తాయి. నెన్నూరుపాడులోని కొంతమంది రైతుల ట్రాన్స్‌ఫార్మర్‌ను అక్రమంగా ఒకచోట నుంచి మరోచోటకు మార్పించి డబ్బులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. కట్టావారిపాలెంలోని ఒక రైతుకు కావాల్సిన విద్యుత్‌ స్తంభాలను సైతం అక్రమంగా కొండపిలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదురుగా పొలాల్లో ఉన్న వాటిని ఎత్తించాడు. 

చేష్టలుడిగి చూస్తున్న ఉన్నతాధికారులు
ట్రాన్స్‌కో అధికారి తన కార్యాలయాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చి దందాలు కొనసాగిస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు చేష్టలుడిగి చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ప్రజలంటున్నారు. ఈ అధికారి సంపాదించిన అక్రమార్జనలో ఉన్నతాధికారులకు సైతం ముడుపులు అందుతున్నాయన్న అనుమానాలు ఈ ప్రాంత రైతులు వ్యక్తం చేస్తున్నారు. రైతుల అవసరాలను తనకు అవకాశంగా మలుచుకుని ముడుపులు మింగుతున్న ఈ అధికారి లీలలు  అన్నీఇన్ని కావు. ఈయన అక్రమాలపై ఇటీవల సింగరాయకొండ ఏడీఈ సైతం వచ్చి విచారణ చేపట్టారు. కొండపి ట్రాన్స్‌కో అధికారి జిల్లా స్థాయి అధికారులు ద్వారా విచారణని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

కొండపి ట్రాన్స్‌కో ఏఈపై వచ్చిన ఆరోపణల గురించి సింగరాయకొండ ఏడీఈ శ్రీనివాసరావును వివరణ కోరగా ఎస్టిమేట్‌లు వేయకుండా వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు రైతులకు ఏఈ ఇస్తున్న మాట వాస్తవమేనని చెప్పారు. అదే విధంగా కొండపి సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ సైతం మాయమైందని, ఈ విషయమై కొండపి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇద్దరు సిబ్బందితో పాటు సెలవులో ఉన్న ఏఈకి సైతం మెమో ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న కొండపి ట్రాన్స్‌కో ఏఈ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా తనపై వస్తున్న అవినీతి, ఆరోపణలు అవాస్తవమని చెప్పకొచ్చారు. ఇదంతా ఏడీఈ కావాలని చేస్తున్నాడని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు