అంతా మాయ!

9 Nov, 2018 07:45 IST|Sakshi
రేషన్‌కార్డులు

అర్హతలున్నా... రేషన్‌కార్డుల జాబితాలో దొరకని చోటు

ఆర్‌టీజీఎస్‌ నమోదులో లోపాలే కారణం

అనూహ్యంగా ప్రభుత్వ  ఉద్యోగులకు తెల్ల రేషన్‌కార్డులు

విస్తుపోతున్న జిల్లాలోని అధికారులు

‘హలో... మీకు తెల్ల రేషన్‌కార్డు ఉందా... ఉంటే 1 నొక్కండి... లేదంటే 2 నొక్కండి’ అంటూ ఇటీవల కొందరికి ప్రభుత్వం తరఫున ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. అందులో లేదు అని నొక్కినవారందరికీ అర్హతలతో సంబంధం లేకుండా తెల్ల రేషన్‌కార్డు మంజూరు చేసేశారు. నాలుగున్నరేళ్లుగా కార్డులకోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్న ఎంతోమందికి మొండి చెయ్యి చూపిన సర్కారు  ఎన్నికలు సమీపిస్తున్న వేళ... అమాంతం ప్రేమ పుట్టుకొచ్చేసి... కొత్తగా తెల్లరేషన్‌కార్డులు మంజూరు చేశారు. తీరా వచ్చిన జాబితాలో 25శాతానికి పైగా ప్రభుత్వ ఉద్యోగులే ఉండటంతో అంతా ఖంగు తిన్నారు.

విజయనగరం గంటస్తంభం: సాంకేతికత అంటే అంతా సక్రమంగా ఉంటేనే. లేదంటే లేనిపోని తలనొప్పులకు తావిస్తుంది. ఇప్పుడు రియల్‌టైమ్స్‌ గవర్నెన్స్‌ సిస్టమ్‌ (ఆర్‌టీజీఎస్‌) కూడా ఇలాంటి కొత్త సమస్యలనే తెచ్చింది. క్షేత్రస్థాయిలో సక్రమంగా పరిశీలనలు జరపకుండా ఏ పథకానికి ఎవరు అర్హులో గుర్తించకుండా... ఏకంగా సచివాలయం నుంచే అన్ని పథకాలకూ లబ్ధిదారుల ఎంపిక చేస్తామని చెప్పి అర్హులకు మొండిచెయ్యి చూపుతున్నారు. పనిలోపనిగా అనర్హులకు అన్నీ వర్తింపజేసేస్తున్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన తికమక అంతా ప్రభుత్వోద్యోగులకు తెల్ల రేషన్‌కార్డులను మంజూరు చేయడమే. ఇక తెలియని ఎన్ని పథకాలు అనర్హులకు అందుతున్నాయనేది ఒక్కసారి పరిశీలించుకోవాల్సిందే.

అన్నింటికీ అదే కారణం
రేషన్‌కార్డు ఎందుకు రాలేదు... పింఛను ఎం దుకు పోయింది?... ఇళ్లు మంజూరుకు దరఖాస్తు పెట్టినా ఎందుకు మంజూరు కాలేదని లబ్ధిదారులు అడిగితే అధికారులు చెప్పే మాట ఆర్‌టీజీఎస్‌. తమ చేతిలో ఏదీ లేదని అం తా ఆ విధానం ద్వారానే జరుగుతుందని తప్పుకుంటున్నారు. తాజాగా జిల్లాకు ప్రభుత్వం 9165 తెల్ల రేషన్‌కార్డులు మంజూరు చేసిన విషయం విదితమే. ఈ వివరాలు ఇటీవల జిల్లా పౌరసరఫరాల అధికారులకు పంపించారు. లబ్ధిదారులకు రేషన్‌కార్డులు అందించేందుకు అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఆ సమయంలోనే అసలు లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది ప్రభు త్వ ఉద్యోగులకు రేషన్‌కార్డులు మంజూరయ్యా యి. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో వారు ఉన్నతాధికారుల దృష్టికి, అక్కడివారు ఆర్టీ జీఎస్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అదంతా నిజ మేనని నిర్ధారణ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది ప్రభుత్వ ఉద్యోగులకు తెల్ల రేషన్‌కార్డులు మంజూరైనట్లు తేలింది. జిల్లాలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు 2809మందికి రేషన్‌కార్డులు మంజూ రైనట్లు స్పష్టమైంది.  మండలాల వారీగా వారి జా బితాను ఉన్నతాధికారుల నుంచి జిల్లాకు అందిం ది. విజయనగరం మండలంలో 806మం ది, కొత్తవలసలో 254, ఎస్‌కో టలో 263మంది ఉద్యోగులకు తెల్ల కార్డులు వచ్చి నట్లు సమాచారం. మిగతా మండలాల్లో పదులు, వందల సంఖ్యలో ఇలా కార్డులు మం జూరైనట్లు సమాచారం. దీంతో వారి కార్డులు నిలుపుదల చేయాలని అధికారులు నిర్ణయిం చారు. అంతేగాదు... మంజూరైనవారిలో ఇంకొంతమంది అనర్హులు ఉన్నట్టు తెలుస్తోంది. గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెం దిన రిటైర్డు ఉద్యోగి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చిం తల అప్పారావుకు రేషన్‌కార్డు మంజూరు కావడం ఇందుకు నిదన్శనం. పూర్తిస్థాయి విచారణ జరిగితే ఎంతమంది అధికా రపార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర అనర్హుల కు కార్డులు మంజూరయ్యాయో స్పష్టమవుతుంది.

విధానంలోనే లోపాలు
వాస్తవానికి ఇప్పుడు రేషన్‌కార్డు మంజూరైందని చెబుతున్నవారెవరూ స్థానికంగా అధికారులకు దరఖాస్తు చేసుకోలేదు. అధికారులు విచారణ చేసి అర్హత తేల్చలేదు. 1100, ఆర్టీజీఎస్‌ ద్వారా ప్రభు త్వ పనితీరుపై సమాచారం  తెలుసుకునేందుకు, రేషన్‌ సిస్టమ్‌పై అభిప్రాయం కోసం ఫోన్‌లు చేస్తున్న విషయం తెలిసిందే. వారు అడిగిన ప్రశ్నల్లో రేషన్‌కార్డు ఉందా లేదా అని అడిగి లేదని నమోదు చేసుకోగానే వారికి తెల్ల రేషన్‌కార్డు మం జూరు చేశారు. మంజూరుకు ముందు ప్రజా సాధికార సర్వే డేటాను అనుసంధానం చేసినా వీరు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో తెలుపు రేషన్‌కార్డు లింకు అయి ఉండకపోవడం కూడా ఇందు కు కారణమే. ఇదంతా చూస్తే ఉద్యోగుల ప్రమే యం లేకుండా రేషన్‌కార్డులు మంజూరు కావడం వెనుక ఆర్టీజీఎస్‌ లోపమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం మంజూరైన మిగతా కార్డులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

క్షేత్రస్థాయిలో పరిశీలనతోనే న్యాయం
సాధారణంగా ఏదైనా పథకానికి అర్హులైనవారిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకున్న తరువాతనే ఎంపిక చేయాలి. అలా కాకుంటే లేని పోని తలనొప్పులు వస్తాయి. రేషన్‌కార్డులు మంజూరు విషయంలో గతంలోనూ పొరపాటు జరిగింది. «నవనిర్మాణ దీక్ష సందర్భంగా జిల్లాకు 6530 రేషన్‌కార్డులు మంజూరు చేశారు. ఈ వివరాలు జిల్లా పౌరసరఫరాల అధికారులకు కూడా పంపించా రు. కార్డులు మంజూరైనట్లు వారు వెల్లడించారు. అయితే ఆర్‌టీజీఎస్‌ అధికారులు తర్వాత కార్డుదారులు వివరాలను ప్రజాసాధికారసర్వేతో లిం కు చేయడంతో అందులో 283 కార్డులు మాత్రమే మంజూరయ్యాయి. మిగతావన్నీ రద్దు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్‌టీజీఎస్‌ పని తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాచా రం మొత్తం సక్రమంగా లేకుండా ఇలాంటి ప్ర యో గాలు, ఎంపిక విధానాలు ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో విచారణ చేసి అసలైన అర్హులకు కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు.  

ప్రభుత్వ ఉద్యోగులకు మంజూయ్యాయి
రేషన్‌కార్డులు మంజూరులో మా పాత్ర లేదు. అంతా ఆర్‌టీజీఎస్‌ విధానంలో లబ్ధిదారుల ఎంపిక జరిగింది. కానీ జిల్లాలో అనేకమంది ఉద్యోగులకు కార్డులు వచ్చాయి. ఆ వివరాలు ఉన్నతాధికారులు పంపించారు. కావున వాటిని నిలుపుదల చేస్తాం. మిగతా కార్డుదారుల అర్హత విషయంలోనూ క్లారిటీ కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశాం.– ఎం.రవిశంకర్, ఏఎస్వో, విజయనగరం

మరిన్ని వార్తలు