-

'కోస్తా జిల్లాల ప్రజలు ఆందోళన పడవద్దు'

22 May, 2014 12:24 IST|Sakshi

హైదరాబాద్ : భూ ప్రకంపనలపై కోస్తా జిల్లాల ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని సునామీ హెచ్చరికల కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ కుమార్ తెలిపారు. బంగాళాఖాతంలో బుధవారం రాత్రి సంభవించిన భూకంపం సునామీగా మారే అవకాశం లేదని ఆయన గురువారమిక్కడ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో నిన్న భూమి స్వల్పంగా కంపించిన విషయం తెలిసిందే.

విశాఖ నగరంలో, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం రాత్రి భూమి కొద్ది సెకెన్ల పాటు తీవ్రంగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.  సుమారు పది సెకెన్ల పాటు తీవ్ర శబ్దంతో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లు, అపార్టమెంట్లలోంచి బయటకు పరుగులు తీశారు. కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది.


కృష్ణా జిల్లాలోని విజయవాడ, పరిసర ప్రాంతాల్లో.. విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, ఎస్.కోట, నెల్లిమర్ల, గజపతినగరం ప్రాంతాల్లో.. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పట్టణంతోపాటు జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో భూకంప ప్రభావం కనిపించింది. తిరుపతి, రాజమండ్రిల్లోనూ భూమి కంపించింది. భారతీయ వాతావరణ శాఖ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్‌పై 6 గా పేర్కొంది.

 

మరిన్ని వార్తలు