అప్పు తీర్చలేక...పత్తి రైతు ఆత్మహత్య

25 Feb, 2018 11:50 IST|Sakshi

కొండ కోనల్లో జీవన ప్రయాణాన్ని సాగించిన ఆ గిరిజనుడికి అప్పు రూపంలో తీర్చలేనంత కష్టమొచ్చింది. పంట సాగు కోసం చేసిన అప్పులు తడిపిమోపిడయ్యాయి. పంట దిగుబడులు బాగా వస్తే తీర్చేయవచ్చన్న ఆయన ఆశలు అడియాశలయ్యాయి. పంట దిగుబడులు చూసి అప్పు తీర్చలేనని మనస్తాపానికి గురైన ఆ  పత్తి రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే...

పార్వతీపురం/కొమరాడ: కోండపోడునే నమ్ముకొని రెండు దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న గిరిజన రైతుకు పెద్ద కష్టమొచ్చింది. కొండపోడు ఎనిమిది ఎకరాల్లో లాభం వస్తుందని ఆశించిన కొమరాడ మండలం మసిమండ గ్రామానికి చెందిన గిరిజన రైతు జీలకర్ర చంద్రయ్య(55) పత్తి పంట వేశాడు. ఏపుగా పెరుగుతున్న మొక్కలను చూసి ఆనందించాడు. చేసిన అప్పులు తీరిపోతాయని పంట దిగుబడి కోసం ఆత్రంగా ఎదురుచూశాడు. కానీ ఆయన అంచనాలు తప్పాయి. మొక్కలైతే ఏపుగా పెరిగాయి కాని పత్తికాయలు మాత్రం కాపునకు రాలేదు. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలే తెలియని స్థితిలో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రయ్య శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పత్తి పంటలో పురుగుల నివారణకు కొనుగోలు చేసిన మందునే తాగి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. ఈ ఏడాది బాగా మదుపులు పెట్టి దిగుబడులపై కొండంత ఆశలు పెట్టుకున్నాడు.

మదుపుల కోసం అప్పులు చేసి దిగుబడి రాకపోవడంతో ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు భార్య జమ్మలమ్మ రోదిస్తూ చెప్పింది. ఈ ఏడాది పంట బాగా వస్తుందని, అప్పులన్నీ తీరిపోతాయని చెప్పేవాడని కన్నీరుమున్నీరైంది. అంతకు ముందు ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఇంట్లోనే పురుగుల మందును తాగిన చంద్రయ్యను చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్యతో పాటు కుమార్తె అన్నాలు, కొడుకులు ముత్యాలు, పాపారావు ఉన్నారు. కొమరాడ ఎస్‌ఐ దినకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు