దగా చేసిన ‘ధనుష్‌’

28 Nov, 2017 11:47 IST|Sakshi
ఏపుగా పెరిగినా కాపులేని పత్తి చేను

500 ఎకరాల్లో పత్తిసాగు చేసిన రైతులు

ఎకరానికి ఒకటి రెండు క్వింటాళ్లే దిగుబడి

ఎకరాకు లక్ష రూపాయల పెట్టుబడి

ఆందోళన చెందుతున్నపత్తి రైతులు

వత్సవాయి మండలంలోని భీమవరం, మక్కపేట, ఇందుగపల్లి, వత్సవాయిలో  ధనుష్‌–3, 4, 6 రకం వంగడాలతో 500 ఎకరాల్లో పత్తిసాగు చేపట్టారు. మొక్కలు ఏపుగా పది అడుగుల ఎత్తు∙పెరిగి కొమ్మలతో విస్తరించాయి. పైరును చూసిన రైతులు అధిక దిగుబడులు ఖాయం అని సంతోషించారు. అయితే ఆశించిన స్థాయిలో పూత, పిందె రాలేదు. అరకొరగా కాసిన కాయలు సన్నగా ఉండటంతో      ఎకరానికి ఒకటి రెండు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. కోత ఖర్చులు కూడా రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

సాక్షి, భీమవరం (వత్సవాయి) : ఆరుగాలం కష్టపడి సాగు చేసినా ఎకరాకు క్వింటా కూడా దిగుబడి రాలేదు. తాము సాగు చేసింది కల్తీ విత్తనాలు అని తెలిసి తెల్లబోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మొరపెట్టుకుంటున్నారు. మండలంలోని భీమవరం, మక్కపేట, ఇందుగపల్లి, వత్సవాయి గ్రామాలలో ఈ ఏడాది కొత్తగా వచ్చిన ధనుష్‌–3, 4, 6 రకం విత్తనాలను సుమారు 500 ఎకరాల్లో సాగు చేశారు. భీమవరం 250 ఎకరాలు, మక్కపేట 100, ఇందుగపల్లిలో 100, వత్సవాయిలో 50 ఎకరాలలో సాగు చేశారు. ఈ విత్తనాలను వత్సవాయి గ్రామంలోని ఒక షాపు నుంచి, భీమవరం గ్రామంలోని ఓ ప్రైవేటు వ్యక్తి నుంచి కొనుగోలు చేసి సాగు చేశారు. మొదట్లో పత్తి మొక్కలు ఏపుగా పది అడుగులకుపైగా పెరిగాయి. పంట ఎత్తు మాత్రం పెరిగింది కానీ పూత, పిందె మాత్రం ఆశించినంతగా రాలేదు. అక్కడక్కడా కాసిన పత్తి కాయలు కూడా సన్నగా కాశాయి. ఎకరానికి క్వింటా, రెండు క్వింటాళ్లు మాత్రమే దిగుబడులు రావడంతో రైతులకు ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. వేరే కంపెనీలకు చెందిన విత్తనాలను నాటిన రైతులకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తుండడంతో కల్తీ విత్తనం వల్లనే నష్టపోయామని గ్రహించారు.

ఎకరానికి లక్ష పెట్టుబడి
పత్తి పంట సాగుచేయడానికి ఎకరానికి లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. సరాసరి కౌలు ఎకరానికి 30 వేలు కాగా ట్రాక్టర్‌ కిరాయి, విత్తనాలు, కూలీలు, పురుగుమందులు, ఎరువులు కలిపి మరో రూ.70 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఎకరానికి 1, 2 క్వింటాళ్లు వస్తుండడంతో తీత కూలి ఖర్చులు కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పత్తి తీతకు ఆసక్తి చూపని కూలీలు
ఈ రకం విత్తనం సాగు చేసిన రైతులకు పత్తి తీసేందుకు కూడా కూలీలు రావడం లేదని చెబుతున్నారు. కాయ సన్నగా ఉండడంతోపాటు సక్రమంగా పగలకపోవడంతో కూలీలకు కూలి గిట్టుబాటు కావడంలేదు. పత్తిని తీసేందుకు కూలీలు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కల్తీ విత్తనాల వల్లనే నష్టపోయామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మండల వ్యవసాయాధికారి పీఎం కిరణ్‌ను వివరణ కోరగా భీమవరం, మక్కపేట, ఇందుగపల్లి గ్రామాల నుంచి ధనుష్‌ విత్తనం వల్ల నష్టపోయాం తమను ఆదుకోవాలని 60 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం.

మరిన్ని వార్తలు