ఆదిలోనే హంసపాదు

30 Nov, 2013 06:28 IST|Sakshi

జైనథ్, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి కొనుగోళ్లు ఆరంభంలోనే రసాభాసగా మారాయి. జైనథ్ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన పత్తిని రైతులే తమ సొంత ఖర్చుతో బేల మండల కేంద్రంలోని జిన్నింగ్ మిల్లుకు తరలించాలని, లేని పక్షంలో మార్కెట్ కమిటీ రవాణ భరించాలని కొనుగోలుదారులు పేర్కొనడంతో ఆదిలోనే కొనుగోళ్లు నిలిచాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు హడావుడిగా కొనుగోళ్లు ప్రారంభిస్తున్నామని ప్రకటించిన మార్కెట్ అధికారులు, పత్తి బండ్లను ఎక్కడ అన్‌లోడ్ చేయాలనే విషయంలో కొనుగోలుదారులకు, రైతులకు స్పష్టత ఇవ్వకపోవడం సమస్యకు దారితీసింది.
 లొల్లి ఇలా మొదలు..
 జైనథ్ మార్కెట్ యార్డులో శుక్రవారం మార్కెట్ కమిటీ చైర్మన్ మునిగెల విఠల్, ఎమ్మెల్యే జోగు రామన్న, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి ఎలక్ట్రానిక్ కాంటాల వద్ద పూజలు చేశారు. కాంటాల కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్ల గదులను ప్రారంభించారు. అనంతరం సీసీఐ, వ్యాపారులు కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే కొందరు రైతులు కొనుగోళ్లు సరే, పత్తిబండ్లను ఎక్కడ అన్‌లోడ్ చేయాలో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. మార్కెట్ అధికారులు, ఆర్డీవో కలుగజేసుకుని రైతులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఇది ఒక్కరోజు సమస్య కాదని శాశ్వతంగా జైనథ్‌లోనే కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
 వ్యాపారుల అడ్డుపుల్ల
 రైతులు అమ్మిన పత్తి బండ్లను జైనథ్ మార్కెట్ యార్డులోనే అన్‌లోడ్ చేయాలని పేర్కొనడంతో వ్యాపారులు అడ్డుపడ్డారు. ఇక్కడే అన్‌లోడింగ్ చేస్తే, పత్తి బండ్లను జిన్నింగ్‌కి తరలించుటకు అయ్యే రవాణ ఖర్చులు తాము భరించలేమని, రైతులు లేదా మార్కెట్ కమిటీ వారే భరించాలని తెల్చిచెప్పారు. జైనథ్‌లో పత్తి నిల్వకు వసతులు లేవని, ముఖ్యంగా ఫైర్‌సేఫ్టీ లేదని వారు అధికారులకు వివరించారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొనుగోళ్లు నిలిచాయి. ఎమ్మెల్యే రామన్న కలుగజేసుకుని కొనుగోలు దారులు, కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని తేల్చిచెప్పారు.

అధికారుల ఆదేశా లు పెడచెవిన పెట్టి మొండిగా వ్యవహరిస్తున్న కొనుగోలుదారులపై చర్యలు తీసుకుంటామని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆర్డీవో అన్నారు. ఈకార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి పుల్లయ్య, తహశీల్దార్ జ్యోతి, ఎంపీడీవో రామకృష్ణ, మార్కెట్ కార్యదర్శి ఫయాజోద్దీన్, జైనథ్ సర్పంచ్ ప్రమీలా పోతారెడ్డి, ఉపసర్పంచ్ గణేశ్ యాదవ్, మాజీ మండల ఉపాధ్యక్షుడు కల్చాప్ రెడ్డి, ఏఎంసీ మాజీ అధ్యక్షుడు యాసం నర్సింగ్, ఏఎంసీ మాజీ ఉపాధ్యాక్షుడు భీమ్‌రెడ్డి, రైతులు కిష్టారెడ్డి, లస్మన్న, అశోక్‌రెడ్డి, అశోక్ యాదవ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు