-

అడ్డదారి

4 Nov, 2013 01:53 IST|Sakshi

భైంసా, న్యూస్‌లైన్ : మన రాష్ట్రానికి చెందిన తెల్ల బంగారాన్ని కొంత మంది వ్యాపారులు, దళారులు గుజరాత్, మహారాష్ట్రకు అక్రమ మార్గాల్లో తరలిస్తున్నారు. రోజూ వందల సంఖ్యలో లారీల్లో తీసుకెళ్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ప్రాంతాల్లో పత్తి కొనుగోలు చేసి.. ఆ పత్తిని యథేచ్ఛగా అక్రమంగా ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. దీంతో మన ప్రభుత్వానికి రావాల్సిన ఐదు శాతం వ్యాట్, ఒక శాతం సెస్ కోల్పోవాల్సి వస్తోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన మధ్య దళారులు, వ్యాపారులు కుమ్మక్కై ఈ దందాను కొనసాగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆరంభమైన పత్తి సీజన్‌లో వీరి దూకుడును అడ్డుకోకపోతే రోజూ కోట్ల రూపాయల పన్నులను ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుంది.
 కలెక్టర్ ఆదేశాలతో...
 ఆదిలాబాద్ కలెక్టర్ అహ్మద్‌బాబు పత్తి కొనుగోళ్లను ప్రతిష్టాత్మకంగాా తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు యార్డులకు, రోడ్లపై కనిపించే వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 29 రాత్రి కుభీర్ మండలం మాలేగాం మార్గం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న ఆరు పత్తి లారీలను ఎస్సై తోట సంజీవ్ పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
 గత నెల 31న తానూరు మండల బెల్‌తరోడ గ్రామం వద్ద రెండు సోయా లారీలతోపాటు ఒక పత్తి లారీని ఎస్సై మసూద్ పట్టుకున్నారు. భైంసా పట్టణ సమీపంలోని అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టు దాటి 61వ జాతీయ రహదారి నుంచి నేరుగా మహారాష్ట్రకు వెళ్తున్నాయంటే అధికారుల పనితీరు స్పష్టమవుతోంది. జాతీయ రహదారిపైనే అనుమతులు లేకుండా పత్తి లారీలు వెళ్తున్నాయంటే అక్రమ వ్యాపారం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ముథోల్ నియోజకవర్గంలో పోలీసులు పత్తి లారీలను పట్టుకోవడంతో తేరుకున్న చెక్‌పోస్టు అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. దీంతో రోజూ వందకుపైగా లారీలు చెక్‌పోస్టుపై కనిపిస్తున్నాయి. కలెక్టర్ పకడ్బందీ ఆదేశాలు అమలు చేసే కోణంలో కొంత మేర తేరుకున్న అధికారులు పత్తి లారీలపై పన్నులు వసూలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అడ్డదారుల్లో మాత్రం నిత్యం లారీలు తరలుతూనే ఉన్నాయి. వాటిపైనా దృష్టి సారిస్తే మంచిదేమో.
 జీరోలో కొనుగోళ్లు...
 రైతుల వద్ద మధ్య దళారులు, వ్యాపారులు జీరోలో కొనుగోళ్లు చేసి అధికారులను మచ్చిక చేసుకుని పన్నులు చెల్లించకుండానే మహారాష్ట్రకు పత్తి లారీలను తరలిస్తున్నారు. మొన్నటి వరకు చక్కెర, బియ్యం, నిన్నటి వరకు సోయాతో అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ అధికారులు పాత ధోరణినే ఎంచుకున్నారు. పత్తిని అక్రమ మార్గంలోనే పక్కరాష్ట్రానికి చేరవేసి వ్యాపారులు మధ్య దళారులకు సహకరించి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఆలోచనవైపే మొగ్గు చూపుతున్నారు. గతేడాది సోయా కొనుగోళ్ల ఆధారంగా తీసుకుంటే జీరోలో పంటలను దళారులు పక్క రాష్ట్రాల్లోకి ఎలా తరలిస్తున్నారో స్పష్టం అవుతుంది. గతేడాది జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో సోయా సాగైంది. అప్పటి ధరతో సుమారుగా రూ.2 కోట్లకుపైగా మార్కెట్ సెస్ రూపేనా ప్రభుత్వానికి రావాల్సి ఉండగా.. కేవలం రూ. 17.74 లక్షలే వచ్చింది.
 వందల లారీల్లో...
 ఒక్కో లారీలో 150 క్వింటాళ్ల మేర పత్తి రవాణా చేయొచ్చు. క్వింటాలు ధర రూ. 4,500 వేసుకున్నా మొత్తం విలువ రూ.6.75 లక్షలు. ఐదు శాతం వ్యాట్ కింద రూ.33,750, ఒక శాతం సెస్ కింద రూ.6,750. మొత్తంగా రూ. 40,500 ఒక్కో లారీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలి. కానీ.. ఇవేమీ చెల్లించకుండా సరిహద్దులు దాటిస్తునానరు. పంట పండించిన రైతులకు మినహాయింపు ఉన్నా వ్యాపారులకు మాత్రం అది వర్తించదు. ఒక రైతు ఒకేసారి 150 క్వింటాళ్ల పత్తిని మార్కెట్‌కు తీసుకురావడం అసాధ్యం. మధ్య దళారులు రైతుల పేరు చెప్పి ప్రభుత్వానికి బురిడీ కొట్టిస్తున్నారు. భైంసా చెక్‌పోస్టు నుంచి కలెక్టర్ ఆదేశాల అనంతరం పత్రాల అనుమతితో 50 నుంచి 60 లారీలు వెళ్తున్నాయి. కాని అక్రమ మార్గంలో రోజూ వందల సంఖ్యలో లారీలు ఎలాంటి పత్రాలు లేకుండానే తరులుతున్నాయి. అధికారులు కూడా ఏమీ పట్టించుకోవడంలేదు.
 ఇష్టారాజ్యంగా..
 ఒక రాష్ట్ర సరిహద్దు దాటి సరుకు రవాణా చేయాలంటే నిబంధనల మేరకు పన్నులు చెల్లించాలి. అన్ని పత్రాలు ఉన్న వారు నేరుగా చెక్‌పోస్టు నుంచి వెళ్లవచ్చు. కానీ.. కొంత మంది దళారులు అక్రమ మార్గాల గుండా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. మన రాష్ట్రంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసిన వ్యాపారులు, మధ్య దళారులు ఈ అక్రమ రాజమార్గాలను ఎంచుకుంటున్నారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి భైంసా, బాసర మార్గాల్లో మహారాష్ట్రకు చేరుకుంటున్నారు. బాసర వద్ద అటవీ శాఖ చెక్‌పోస్టు ఉండడంతో అక్కడి నుంచి బిద్రెల్లి మీదుగా మహారాష్ట్రకు వెళ్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్, నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్‌లు మహారాష్ట్రకు సరిహద్దు కావడంతో ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ లారీలు తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూరా, ఆదిలాబాద్ జిల్లా భైంసా వద్ద అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టులు ఉన్నా వీటిని తప్పించేస్తున్నారు.
 

చెక్‌పోస్టు లేని మార్గాల గుండా లారీలు పంపించేస్తున్నారు. తానూరు మండలం హిప్నెల్లి, కుభీర్ మండలం పల్సి, కుంటాల మండలం అంబుగాం ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు చేరుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్‌లోని ఖండ్‌గాం నుంచి మహారాష్ట్రలోని కొండల్‌వాడికి చేరుకోవచ్చు. అదే జిల్లాలోని కందకుర్తి నుంచి దర్మాబాద్ చేరుకోవచ్చు. మద్నూర్ నుంచి దెగ్లూర్‌కు, బాన్సువాడ ప్రాంతంలోని పొతంగల్ నుంచి మంజీర వంతెన మీదుగా మహారాష్ట్రకు చేరుకోవచ్చు. ఈ అక్రమ మార్గాల్లో రోజు 500లకుపైగా పత్తి లారీలు వెళ్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన మన ప్రభుత్వం రోజుకు రూ. 4 కోట్ల మేర నష్టం చవిచూడాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు తేరుకుని రైతుల ముసుగులో మధ్య దళారులు, వ్యాపారులు సాగించే జీరో దందాను అక్రమమార్గాల్లో తరలించే లారీలను అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు