బది‘లీల’లు

18 Jun, 2016 02:03 IST|Sakshi

ఆన్‌లైన్ ఫార్స్.. అంతా సిఫార్సు
మైదాన ప్రాంతాలకు డిప్యుటేషన్ సిబ్బంది
ముగిసిన గడువు.. 1872 మంది దరఖాస్తు
నేటి నుంచి శాఖల వారీ కౌన్సెలింగ్

 

పారదర్శకంగా బదిలీలకు సర్కార్ ఆదేశాలిచ్చింది. ఇందుకు తొలిసారిగా ఆన్ లైన్ ఎంప్లాయీస్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్(ఓఏటీఎస్)ను అమలులోకి తెచ్చింది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం గతంలో మాదిరి సిఫార్సులకే అధికారులు పెద్దపీట వేస్తున్నారు. ఉద్యోగ సంఘాల్లో కీలక పదవుల్లో ఉన్నవారు, డెప్యుటేషన్లపై పనిచేస్తున్న వారంతా నిబంధనల మాటున కోరుకున్న చోట పోస్టింగ్‌లకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు బదిలీల కౌన్సెలింగ్‌కు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

 

విశాఖపట్నం: బది‘లీల’లు కొనసాగుతున్నాయి.పైరవీలు ఊపందుకుంటున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెల20వ తేదీలోగా దీనిని ముగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఐదేళ్లు దాటిన వారిని విధిగా బదిలీ చేయాల్సిందే. మూడేళ్లు దాటిన వారెవరైనా ఉండే రిక్వస్ట్ ట్రాన్సఫర్ పెట్టుకోవచ్చు. ఏజెన్సీ లో అయితే రెండేళ్లు దాటితే బదిలీకి అర్హులు. తొలుత 14వ తేదీలోగా జాబితాలను తయారు చేసి 17వ తేదీలోగా బదిలీల తంతు ముగించాలని భావించారు. కానీ ఇంతలో ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన ఓఎటీఎస్ వల్ల బదిలీల ప్రక్రియలో కొంత జాప్యం చోటుచేసుకుంది.  అందరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిఉంది. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో 35,200 మంది పనిచేస్తున్నారు. 17వతేదీ రాత్రి ఏడు గంటలతో గడువు ముగిసేటప్పటికి ఆన్‌లైన్‌లో కేవలం 1872మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవంగా ఐదేళ్లుదాటిన వారు రెవెన్యూతో సహా వివిధశాఖల్లో 3వేలకు పైగా సిబ్బంది ఉన్నారు. ఐదేళ్లు దాటినా బదిలీలకు ఇష్టపడక దరఖాస్తు చేయలేని వారి తరపున దరఖాస్తు చేసే బాధ్యతను ఆయా డ్రాయింగ్ ఆఫీసర్లకు అప్పగించారు. వారు అప్‌లోడ్ చేస్తే ఆటోమెటిక్‌గా వారంతా  జాబితాలో చేరతారు. పెర్‌ఫార్మెన్స్ ఆధారంగా బదిలీలు చేపట్టేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరి సెల్ఫ్‌అప్రైజర్‌ను అప్‌లోడ్ చేయాలని ఆదేశాలిచ్చారు.


ఆరోగ్య పరమైన కారణాలతో బదిలీలు కోరుకునే వారి విషయంలో కూడా నిబంధనలు విధించారు. ఇలా ఐదుశాతానికి మించి ఉండడానికి వీల్లేదని పేర్కొన్నారు. నిబంధనలను ఆసరాగా చేసుకొని ఏజెన్సీలో పనిచేస్తూ డెప్యుటేషన్‌పై మైదానంలో పనిచేస్తున్న వారు హేపీగా తాజా బదిలీల్లో మైదాన ప్రాంతాల్లో కోరుకున్న చోట పోస్టింగ్ పొందేందుకు పైరవీలు సాగిస్తున్నారు. ఇలా రెవెన్యూ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించారు. వీరిలో పలువురు ఏజెన్సీలో జీతాలు..మైదాన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా కలెక్టరేట్‌తో సహా విశాఖ, అనకాపల్లి ఆర్డీవో కార్యాలయాలు, విశాఖ పరిసర ప్రాంతాల్లోని రెవెన్యూ కార్యాలయాల్లో పని చేస్తున్న వారు సైతం చాలా మంది డెప్యుటేషన్‌పైనే కొనసాగుతున్నట్టు గుర్తించారు. వీరిలో ఐదేళ్లు దాటిన వారు చాలా తక్కువగానే ఉన్నప్ప టికీ మూడేళ్లు దాటిన వారు మాత్రం ఎక్కువగానే ఉన్నారు. వీరంతా రిక్వస్టు ట్రాన్సఫర్స్ ఆప్షన్‌తో మైదాన ప్రాంతంలో పోస్టింగ్‌లకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆన్‌లైన్ పేరుతో పైకి పారదర్శకత అంటున్నప్పటికీ.. అంతా సిఫార్సులకే పెద్ద పీట వేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు ఇబ్బంది లేకుండానే బదిలీలు పూర్తి చేయాలని ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలొచ్చినట్టు స్వయంగా జిల్లా అధికారులే చెబుతున్నారు. దీంతో పచ్చనేతల చుట్టూ పచ్చ కాగితాలతో ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. పేరుకు ఫెర్‌ఫార్మెన్స్ ఆధారంగా బదిలీ లంటూనే ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలే ఫెర్‌ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని స్పష్టమవుతోంది. శనివారం నుంచి మూడ్రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

 

>
మరిన్ని వార్తలు