చమన్‌.. చమక్కా!.. పూల పాన్పా!

11 Jul, 2017 07:41 IST|Sakshi
చమన్‌.. చమక్కా!.. పూల పాన్పా!

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మార్పుపై సర్వత్రా చర్చ
ఈ నెల 15న రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రితో చెప్పిన చమన్‌
కొత్త చైర్మన్‌గా పూల నాగరాజుకు అవకాశం
పదవి నుంచి దిగిపోయేందుకు చమన్‌ అయిష్టత
చైర్మన్‌గిరి దక్కుతుందా? లేదా? అని పూలనాగరాజులో ఆందోళన
చమన్‌ విషయంలో చేతులెత్తేసిన మంత్రి పరిటాల సునీత


జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఒప్పందం మేరకు రెండున్నరేళ్లకు జెడ్పీ పీఠం నుంచి దిగిపోవల్సిన చమన్‌ ఐదేళ్ల పాటు తనే కొనసాగాలని ఆశిస్తున్నారు. ఇదే సమయంలో జెడ్పీ పీఠం దిక్కించుకోవాలనే కోరిక ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ నెరవేరదని పూల నాగరాజు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఎట్టకేలకు సీఎం జోక్యంతో రాజీనామాకు చమన్‌ అంగీకరించినట్లు చర్చ జరుగుతున్నా.. ఇప్పటికీ అయిష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పూల నాగరాజు కోరిక నెరవేరుతుందా? లేదా? అనే చర్చ అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. రాజీనామాకు మరో ఐదురోజులే గడువు ఉండటం ఉత్కంఠకు దారితీస్తోంది.

సాక్షిప్రతినిధి, అనంతపురం: జిల్లాలో అధిక శాతం జెడ్పీటీసీ స్థానాలు టీడీపీ గెలవడంతో జిల్లా పరిషత్‌ పీఠం ఆ పార్టీ వశమైంది. మొదటి రెండున్నరేళ్లు చమన్, ఆ తర్వాత గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు పూల నాగరాజు జెడ్పీ చైర్మన్‌గా ఉండేందుకు పార్టీ నిర్ణయించింది. ఒప్పందం మేరకు ఈ ఏడాది జనవరి 5న చమన్‌ రాజీనామా చేసి గద్దెదిగాలి. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌లో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి ఆ బాధ్యతను అప్పటి పార్టీ ఇన్‌చార్జి మంత్రి కొల్లురవీంద్రకు అప్పగించింది. సమావేశంలో జెడ్పీ చైర్మన్‌ అంశాన్ని మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి ప్రస్తావించారు. ఒప్పందం మేరకు జెడ్పీ చైర్మన్‌ నాగరాజుకు ఇవ్వాలని కోరారు. దీన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళదామని జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి చెప్పారు. ఈ నేపథ్యంలో మరో మూన్నెల్లు చమన్‌ పదవీకాలన్నీ పొడిగించారు.

ఈ లెక్కన మార్చి 5న రాజీనామా చేయాలి. అప్పుడూ చమన్‌ రాజీనామా చేయలేదు. జెడ్పీ చైర్మన్‌ పీఠం కాపాడుకునేందుకు చమన్‌ ఈ ఆర్నెల్ల కాలంలో అన్ని రకాలుగా ప్రయత్నించారు. ఎన్నికలకు పూల నాగరాజు పెట్టుకున్న ఖర్చు చెల్లించి, ఐదేళ్లపాటు తానే చైర్మన్‌గా కొనసాగుతానని రాయబారాలు పంపినట్లు టీడీపీలో జోరుగా చర్చ నడిచింది. అయితే ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ జిల్లాస్థాయి పదవి దక్కదని, తనకెలాంటి డబ్బు అవసరం లేదని, ఒప్పందం మేరకు పదవిని కట్టబెట్టాలని నాగరాజు తేల్చి చెప్పారు. దీంతో తన సామాజికవర్గం నేతలతో ఉద్యమం చేయించే ప్రయత్నం కూడా చమన్‌ చేశారు. డిసెంబర్‌లో టీడీపీ సమన్వయకమిటీ భేటీ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ చమన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. కొల్లుకు వినతి పత్రం అందజేశారు. అప్పట్లో దీనిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత విషయాలపై కాంగ్రెస్‌ నేతల జోక్యం ఏంటని ఆగ్రహించారు.

సీఎం ఇచ్చిన గడువు జూలై 15
గత నెల అమరావతిలో ‘అనంత’ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జెడ్పీచైర్మన్‌ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఒప్పందం మేరకు జనవరి 5న రాజీనామా చేయాల్సి ఉంటే, ఇంకా ఎందుకు కొనసాగుతున్నారని సీఎం ప్రశ్నించారు. తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశించారు. అయితే అనివార్య కారణాలతో జూలై 15న రాజీనామా చేస్తానని చమన్‌ విన్నవించారు. ఇదే సమావేశంలో పుట్టపర్తి మునిసిపల్‌ చైర్మన్‌ గంగన్న కూడా రాజీనామా చేయాలని సీఎం ఆదేశించారు. గంగన్న చైర్మన్‌గిరి వదులుకునేందుకు విముఖత చూపుతూ ప్రకటనలు చేయడంతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ క్రమంలో చమన్‌ కూడా జెడ్పీ పీఠం దిగేందుకు అయిష్టంగా ఉన్నారు. ఇటీవల దూదేకుల, ముస్లిం సామాజికవర్గాలకు చెందిన కొందరు నేతలు అక్కడక్కడా చమన్‌ను కొనసాగించాలని ప్రకటనలు చేస్తున్నారు. గత పదిరోజుల్లో ఇలాంటి ప్రకటనలు కాస్తా అధికమవుతున్నాయి. చమన్‌ సూచనతో ఇలాంటి ప్రకటనలు వెలువడుతున్నాయని టీడీపీ వర్గాలు చెబుతన్నాయి. దీన్నిబట్టి చూస్తే 15న చమన్‌ రాజీనామా చేస్తారా? లేదా? అనే సందిగ్ధం కూడా ఇటు టీడీపీతో పాటు జిల్లాలోని రాజకీయనేతల్లో నెలకొంది.

చమన్‌కు మద్దతుగా ఎవ్వరూ లేరా?
చమన్‌ మంత్రి పరిటాల సునీత అనుచరుడు. ప్రస్తుతం జిల్లాలో పరిటాల వర్గం అత్యంత బలహీనంగా ఉంది. చమన్, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ మినహా సునీత వెంట నడిచేవారు ఎవ్వరూ లేరు. పార్టీ ప్రధాన కార్యదర్శి వరదాపురం సూరి, ఎమ్మెల్సీ కేశవ్, జేసీ బ్రదర్స్, ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, చివరకు జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి సునీత వ్యతిరేకవర్గంగా కొనసాగుతున్నారు. సునీత అంశం ఏదున్నా వీరంతా ఏకమై వ్యతిరేకిస్తున్నారు. ఆమెను మరింత బలహీనపరచాలనే లక్ష్యంతో ఒప్పందం మేరకు జెడ్పీ పీఠం నాగరాజుకు కట్టబెట్టాల్సిందేనని వీరు అధిష్టానం వద్ద తమ వాణి గట్టిగానే విన్పించారు.

తనను జెడ్పీ పీఠంలో కొనసాగేలా చూడాలని చమన్‌ సునీతకు విన్నవించినా ఆమె కూడా ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత తగ్గించి శాఖను మార్చడం, పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చే అంశంలో అంచనాలను భారీగా పెంచి డిజైన్లు పంపారనే నిర్ణయానికి సీఎం రావడం లాంటి అంశాలు సునీతను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన మాట సాగనప్పుడు మౌనంగా ఉండటమే మేలనే నిర్ణయానికి ఆమె వచ్చినట్లు తెలుస్తోంది. పరిటాల వర్గం బలహీనపడటం, ఆ వర్గం అనుచరుడు కావడం కూడా తనకు ప్రతికూలాంశంగా పరిణమించడంతో ఒంటరిగానే రాజకీయాల్లో బలపడాలనే యోచనకు చమన్‌ వచ్చినట్లు సమాచారం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు