ఇక 2 రోజులే!

21 May, 2019 11:33 IST|Sakshi
 కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన టేబుళ్లు  

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

23 న ఉదయం 8 గంటలకు ప్రారంభం 

అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా ఎన్నికల అధికారులు 

అభ్యర్థులు, ఏజెంట్ల  సమక్షంలో కౌంటింగ్‌ 

12 గంటల తర్వాత ఫలితాల వెల్లడి 

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఇక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. కొన్ని గంటలు గడిస్తే ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఫలితాలపై రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల బందోబస్తు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రత కల్పించారు. ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఫలితాలు వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

చిత్తూరు కలెక్టరేట్‌: ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రెండు రోజులే గడువు ఉండడంతో జిల్లా ఎన్నికల యంత్రాంగం కసరత్తును వేగవంతం చేసింది. కౌంటింగ్‌ సజావుగా జరిగేందుకు సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని 3,800 పోలింగ్‌ కేంద్రాల్లో ఉపయోగించిన ఈవీఎంలను ఉంచిన జిల్లా కేంద్రానికి సరిహద్దులోని సీతమ్స్, ఎస్వీసెట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఈనెల 23న లెక్కింపు ప్రక్రియ సాగనుంది.

జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంట్‌ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఆ రెండు కేంద్రాల్లో జరగనుంది. కలెక్టరేట్‌ నుంచి, ఇతర శాఖల నుంచి అవసరమైన కంప్యూటర్లను అక్కడికి తరలించారు. ఆయా నియోజకవర్గాల ఆర్వోలు కౌంటింగ్‌ ప్రక్రియను 100 శాతం పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్నకు నివేదికలను పంపుతున్నారు. ఈసీ అనుమతి ప్రకారం ప్రతి నియోజకవర్గం కౌంటింగ్‌ బ్లాక్‌లో పార్లమెంట్‌కు, అసెంబ్లీకి వేర్వేరుగా కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటుచేశారు.

23న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట సర్వీస్‌ ఓట్లు, తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌లను లెక్కిస్తారు. 12 గంటల తర్వాత తొలి ఫలితం, రెండున్నర తర్వాత చివరి ఫలితం వెలువడే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో రౌండ్‌కి 15 నిమిషాల సమయం పడుతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఒక్క గంటలో 4

రౌండ్లు లెక్కింపు పూర్తి అవుతుందని వెల్లడిస్తున్నారు. 
జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఒక కౌంటింగ్‌ కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు. 
ఒక్కో నియోజకవర్గం కౌంటింగ్‌ కేంద్రంలో ఈసీ అనుమతి ప్రకారం పార్లమెంట్‌కు, అసెంబ్లీకి టేబుళ్లు ఏర్పాటు చేశారు. 
   500 పోస్టల్‌ బ్యాలెట్లకు ఒక టేబుల్‌ను ఏర్పాటు చేశారు. రిటర్నింగ్‌ అధికారికి మరో అదనపు టేబుల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 
జిల్లాలోని 14 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ స్థానాలకు 450 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 
 ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్‌ సూపర్‌వైజర్, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌తో పాటు ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. 
 స్ట్రాంగ్‌ రూంలో ఉన్న ఈవీఎంలను రౌండ్ల వారీగా ఆయా టేబుళ్ల వద్దకు తీసుకొచ్చేందుకు టేబుల్‌కు ఒకరు చొప్పున సిబ్బందిని నియమించారు. వారికి ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను ఏర్పాటు చేశారు. 
 ఆర్వోతో పాటు అబ్జర్వర్‌లు ఆయా నియోజకవర్గం కౌంటింగ్‌ కేంద్రంలో ఉంటారు. 
 ప్రతి టేబుల్‌కు పోటీచేసిన అభ్యర్థులకు సంబంధించి ఒక్కో ఏజెంట్‌ చొప్పున ఆ నియోజకవర్గానికి ఎన్ని టేబుళ్లు ఉన్నాయో అంతమంది ఏజెంట్లు  కౌంటింగ్‌కు ముందు ప్రిసైడింగ్‌ అధికారి సంతకంతో ఉన్న 17     సి ఫారం వివరాలను కౌంటింగ్‌కు ముందు ఏజెంట్లకు తెలియజేస్తారు. 
 17 సి ఫారంలో ఈవీఎంల వారీగా పోల్‌ అయిన ఓట్ల వివరాలు ఉంటాయి.(పోలింగ్‌ పూర్తయ్యాక ఫారం 17 సి లో నమోదు చేస్తారు).
 పోల్‌ అయిన ఓట్లు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో, లేదో సరి చూసుకుంటారు. 
 అవన్నీ టేబుళ్ల వారీగా కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌ నోట్‌ చేసుకోవడంతో పాటు ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు తీసుకుంటారు. వాటిని ఏజెంట్లు రాసుకున్న తర్వాత ఈవీఎంల సీల్‌ను తొలగించి ఫలితాల     బటన్‌ నొక్కుతారు. 
 వెంటనే అభ్యర్థుల వారీగా వారికి పోల్‌ అయిన ఓట్లు వెలువడుతాయి. ఒక్కో రౌండ్‌లో 14 ఈవీఎంల ఫలితాలు వెలువడుతాయి. 
 పోలింగ్‌ కేంద్రాల సంఖ్య, ఓటర్ల సంఖ్య ను బట్టి రౌండ్ల సంఖ్య  ఉంటుంది. 
 కౌంటింగ్‌ పూర్తయిన అనంతరం అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో ప్రతి నియోజకవర్గంలో ఐదు పోలింగ్‌ బూత్‌లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఎంపిక చేసే ఐదు వీవీ ప్యాట్‌లలోని ఓటరు స్లిప్పులను         లెక్కించనున్నారు. తుది ఫలితాలు 23 వ తేదీ అర్ధరాత్రి వెలువడుతాయని జిల్లా ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
ముఖ్యమైన ఫారాలు ఇవే 
ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతితోపాటు ఏపార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి.. విజయ ధ్రువపత్రానికి కొన్ని ఫారాలను ఎన్నికల సంఘం నిర్ధేశించింది. అవి..
ఫారం–18 : కౌంటింగ్‌ ఏజెంట్‌ నియామక ధ్రువపత్రం. ఎన్నికల అధికారి (ఆర్వో) జారీచేసిన ఈ ధ్రువపత్రం ఉంటేనే రాజకీయ పార్టీల ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తారు. 
అనెగ్జర్‌ –38 : ఓట్ల లెక్కింపుకు నియమితులైన పర్యవేక్షకులకు, సహాయకులకు జారీ చేసే ధ్రువపత్రాన్ని అనెగ్జర్‌ –38 అంటారు. 
అనెగ్జర్‌ –ఏ :  ఎంపిక చేసిన ఐదు వీవీ ప్యాట్ల వివరాలు అందులో ఉంటాయి. 
అనెగ్జర్‌ – బి : వీవీ ప్యాట్లలోని స్లిప్పుల లెక్కింపు, తరువాత ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఎన్నికల సంఘం నుంచి నియమితులైన అబ్జర్వర్‌ ధ్రువీకరించే పత్రం ఇది. 
ఫారం–21సీ– ఓట్ల లెక్కింపు అనంతరం వెలువడే ఫలితాలను ఇందులో నమోదు చేస్తారు. 
ఫారం–21 ఈ– నియోజకవర్గంలో ఏ పార్టీకి.. అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి. ఎవరు విజయం సాధించారనే సమగ్ర వివరాలు ఇందులో ఉంటాయి. 
ఫారం 22 –విజయం సాధించిన అభ్యర్థికి ఎన్నికల అధికారి జారీచేసే ధ్రువపత్రం ఇది. దీని ద్వారానే చట్టసభల్లో సభ్యులుగా ఎంపికవుతారు. 
అనగ్జర్‌–58 – పార్టు–1 లో పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓట్లు, పోలైన ఓట్ల వివరా>లుంటాయి. పార్టు 2 లో పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓట్ల లెక్కింపు, గెలుపొందిన వారి వివరాలు ఉంటాయి. 
అనగ్జర్‌–39– తుది ఫలితం వివరాలు ఇందులో సమగ్రంగా ఉంటాయి. పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓట్ల అధిక్యాలు నోటాతో సహా పొందుపరుస్తారు. ఆర్‌వో సంతకం చేసిన తరువాత అధికారికంగా దీన్ని విడుదల చేస్తారు. 

మరిన్ని వార్తలు