దంపతుల దారుణ హత్య

20 Sep, 2018 09:19 IST|Sakshi

భార్యభర్తల గొంతు కోసి పరారీ

30 సవర్ల బంగారం దోచుకెళ్లిన దుండగులు 

చీమకుర్తి పట్టణంలో దారుణం

ఉలిక్కి పడిన స్థానికులు 

క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్‌ పరిశీలన

నగల కోసమే హత్య జరిగినట్టు అనుమానాలు 

పగలంతా దుకాణంలో తీరిక లేకుండా గడిపిన ఆ దంపతులు రాత్రికి ఇంటికి చేరారు. వేకువ జామునే లేచి పనులు ముగించుకొని ఉదయం 9 గంటల కల్లా తిరిగి షాపు తెరిచే వారు ఆ రోజు 10 గంటలు దాటినా ఇంటి నుంచి బయటకు రాలేదు. ఏంటా అని ఇరుగుపొరుగు వారింటికి వెళ్లి చూశారు. రక్తపు మగుగులో పడి ఉన్న దంపతుల మృతదేహాలను చూసి గుండెలు బాదుకున్నారు. వ్యాపారం తప్ప వేరే వ్యాపకం తెలియని భార్యభర్తలను దుండగులు గొంతుకోసి హత్య చేశారు. ఇంట్లో ఉన్న 30 సవర్ల బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ దారుణ ఘటన చీమకుర్తి పట్టణంలో బుధవారం ఉదయం వెలుగు చూసింది. 

చీమకుర్తి రూరల్‌:   గుర్తుతెలియని వ్యక్తులు దంపతులను గొంతు కోసి హతమార్చిన ఘటన చీమకుర్తి పట్టణంలో భయాందోళనలు రేకెత్తించింది. ఎవరితో ఎలాంటి వివాదాలు లేని కుటుంబంలో ఇలాంటి దారుణం జరగడం తీవ్ర విషాదానికి కారణమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దింటకుర్తి వెంకట సుబ్బారావు (58), రాజ్యలక్ష్మి(52) దంపతులు చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని ఇసుకవాగు సెంటర్‌లో దశాబ్దాలుగా వాసవి జనరల్‌ స్టోర్సు నిర్వహిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, కుమార్తెలకు వివాహాలు చేశారు. ఇద్దరు కుమారుల్లో ఒకరు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాగా, రెండో కుమారుడు పొదిలిలో చిల్లర కొట్టుపెట్టుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. కుమార్తెను ఒంగోలు ఇచ్చారు. 

మొదటి నుంచీ దుకాణం ఉన్న భవనంలోనే నివాసం ఉండే సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులు అక్కడ ఇరుకుగా ఉండటంతో మూడేళ్ల కిందట మెయిన్‌ రోడ్డును ఆనుకొని ఉండే కోటకట్ల వారి వీధిలో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం రాత్రి దుకాణం మూసివేసే ముందుగా రాజ్యలక్ష్మి షాపు నుంచి ఇంటికి వచ్చింది. గంట తర్వాత 9.30 గంటల సమయంలో భర్త కూడా ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఉదయానికి ఇద్దరూ రక్తపు మడుగులో విగత జీవులుగా పడిఉన్నారు. పొదిలిలో నివాసం ఉంటే కుమారుడు బుధవారం ఉదయం తండ్రికి ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. రోజూ ఉదయాన్నే షాపు తెరవడానికి వెళ్లే దంపతులు ఉదయం 10 గంటలు అవుతున్నా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఇంటి ముందు నివాసం ఉండేవారు సుబ్బారావు ఇంటికి వెళ్లి చూశారు. దంపతులు ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

రూ.7 లక్షల సొత్తు చోరీ..
ఘటనాప్రాంతాన్ని డీఎస్పీ మరియదాస్, సీఐలు దేవప్రభాకర్, రాఘవేంద్రతో పాటు చీమకుర్తి, సంతనూతలపాడు ఎస్సైలు జీవీ.చౌదరి, షేక్‌ ఖాదర్‌భాషా సందర్శించి వివరాలు సేకరించారు. క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్‌ వచ్చి పరిసరాలను పరిశీలించింది. ఇంట్లో ఉన్న రూ.7 లక్షల విలువైన 30 సవర్ల బంగారం చోరీ జరిగినట్టు మృతుల బంధువుల ద్వారా గుర్తించారు. వాటిల్లో బంగారం బిస్కెట్, రెండు హారాలు, ఇతర వస్తులు ఉన్నాయి. మృతదేహాల వద్ద రక్తం గడ్డకటిన పరిస్థితిని చూసి మంగళవారం రాత్రి 10 గంటల సమయంలోనే జరిగి ఉండొచ్చని, బంగారం కోసమే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి సుబ్బారావు నివాసానికి రెండిళ్ల అవతల వినాయకుడి విగ్రహం వద్ద లడ్డు వేలం పాట జరుగుతోంది. మైకులో శబ్దాల హోరుతో ఎవరింట్లో ఏం జరుగుతోందో వినిపించే పరిస్థితి లేదు. దీనికి తోడు వర్షం కురుస్తోంది. ఇదంతా గమనించిన దుండగులు పక్కనున్న చిన్న సందులో నుంచి మేడపైకి వెళ్లి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు నిరసనగా ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆధ్వర్యంలో చీమకుర్తి మెయిన్‌రోడ్డులో బుధవారం రాత్రి శాంతి ర్యాలీ నిర్వహించి పోలీస్‌ స్టేషన్‌ ముందు నిరసన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు