కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

16 Oct, 2018 12:32 IST|Sakshi

శ్రీకాళహస్తిలో దారుణం

అనాథలైన ఇద్దరు కుమార్తెలు

శ్రీకాళహస్తి: మనస్పర్థలు, ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఉదయం శ్రీకాళహస్తి పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన మునికుమార్‌(44)కు నెల్లూరుకి చెందిన మాధవి(39)కి 16ఏళ్ల క్రితం వివాహమైంది.  వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. మునికుమార్‌ తిరుపతిలోని మ్యూజిక్‌ కళాశాలలో నాదస్వరం కాంట్రాక్ట్‌ లెక్చరర్‌గా చేస్తున్నారు. అయితే కొంతకాలంగా వీరి కుటుంబంలో వివాదాలు తలెత్తాయి. దీంతో మాధవి తనను వేధిస్తున్నారని భర్తపై శ్రీకాళహస్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమేరకు గతంలో పోలీసులు వారికి పలుమార్లు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. 

అయినా వివాదాలు తగ్గుముఖం పట్టకపోగా.. కొత్తగా ఆర్థిక సమస్యలు కూడా తోడైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంతోనే వారు సోమవారం ఉదయం పట్టణంలోని కర్నాలవీధిలోని తమ నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పాడ్డారు. కుమార్తెలతోపాటు కొందరు బంధువులు ఇంటిలో ఉండగా.. వారిద్దరు ఓ గదిలోకి వెళ్లారు. ఎంత సమయానికి రాకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు కిటికీల్లో నుంచి చూడగా ఉరేసుకుని కనిపించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మునికుమార్‌ దంపతులు కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. గతంలో వీరికి పోలీస్‌ స్టేషన్‌లోనే కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు చెప్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 

కలచివేసిన కుమార్తెల రోదన..
మునికుమార్, మాధవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె శ్రావణి పదోతరగతి, చిన్నకుమార్తె సాయిలక్ష్మి 8వ తరగతి చదువుతున్నారు. తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో వారిద్దరూ అనాథలయ్యారు. వారి రోదన స్థానికులను కలచివేసింది.
 

మరిన్ని వార్తలు