ఎందుకో.. ఏమిటో!

19 Dec, 2017 08:04 IST|Sakshi

రైలు కింద పడి జంట ఆత్మహత్య  

 ఇద్దరూ వివాహితులే

వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. రైలు పట్టాల వద్దకు చేరుకున్నారు. ఇద్దరు చాలా సేపు వాదులాడుకున్నారు. అనంతరం రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు.

పిఠాపురం టౌన్‌: స్థానిక గోర్స రైల్వే గేటు సమీపంలోని విజయవాడ వైపు వెళ్లే రైలు పట్టాలపై సోమవారం తెల్లవారుజామున ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతుడు మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన ఇందిన సూరిబాబు(30) అని రైల్వే పోలీసులు తెలిపారు. సంఘటన స్థలం వద్ద దొరికిన సెల్‌ఫోన్‌ ఆధారంగా వివరాలు సేకరించినట్టు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 26 ఏళ్లు ఉంటాయని, మెడలో నల్లపూసలున్నాయని, వివాహితురాలిగా భావిస్తున్నామని, ఇంకా ఆమె వివరాలు తెలియాల్సి ఉందని రైల్వే పోలీసులు తెలిపారు. వీరిద్దరూ భార్యభర్తలు మాత్రం కాదన్నారు. మృతుడు సూరబాబుకి పెళ్లయ్యిందని ఇద్దరు పిల్లలున్నట్టు బంధువులు తెలిపారని చెప్పారు. సూరిబాబు కుటుంబసభ్యులతో హైదరాబాదులో ఉంటున్నాడని అతడి భార్య అక్కడ వంటిమనిషిగా పనిచేస్తుందని తెలిపారు.

ఇదిలా ఉండగా కుటుంబసభ్యుల సమాచారం మేరకు ఆదివారం సూరిబాబు ఏడిదలోని బంధువులకు ఫోన్‌ చేసి తాను పిఠాపురంలో ఉన్నానని ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్టుగా చెప్పినట్టు తెలిపారు.  సంఘటనా స్థలం వద్ద మృతులిద్దరూ వాదులాడుకోవడం చూశానని ప్రత్యక్షసాక్షి తెలిపాడు. ప్రమాద సంఘటనను పరిశీలిస్తే సూరిబాబు ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలకు అడ్డుగా పడుకుని ఆత్మహత్య చేసుకోవడంతో శరీరం రెండు భాగాలుగా విడిపోయింది. వివాహిత మహిళ మృతదేహం మాత్రం రైలుపట్టాలకు ఓ వైపున పడి ఉంది. సామర్లకోట రైల్వే పోలీసులు మృతదేహాలను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్ష నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతురాలి వివరాలు సేకరించే పనిలో ఉన్నామని తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు