మరణంలోనూ ఒకరికొకరు తోడుగా

11 Nov, 2018 10:25 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

పప్పులవీధిలో విషాదఛాయలు

వారిద్దరిది అన్యోన్య దాంపత్యం. దంపతులంటే ఇలా ఉండాలని చూసిన వారందరూ అనుకునేంతగా కలిసుండేవారు. వారిని చూసి ఎవరికి కన్నుకుట్టిందో తెలియదు గానీ రోడ్డుప్రమాదంలో దంపతులిద్దరూ మృతిచెందారు. మరణం కూడా తమని వేరుచేయలేదని నిరూపించుకున్నారు.    

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరులోని పప్పులవీధిలో ఉన్న దత్తాత్రేయ అపార్ట్‌మెంట్‌లో గ్రంథి నాగేశ్వరరావు(57), సులోచనమ్మ(55) నివాసం ఉంటున్నారు. వారికి అరుణ్, హరిత అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వతహాగా కష్టజీవి అయిన నాగేశ్వరరావు లారీ ఓనర్‌గా జీవనం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ఈ క్రమంలో జిల్లా లారీ అసోసియేషన్‌ కోశాధికారిగా బాధ్యతలు కూడా నిర్వహించారు. తనలా తన పిల్లలు కష్టపడకూడదని భావించి వారిని ఉన్నత చదువులు చదివించి వివాహం చేశారు. ప్రస్తుతం కుమారుడు అరుణ్‌ బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా కుమార్తె హరిత తన తల్లిదండ్రులకు దగ్గర్లోనే నివాసం ఉంటోంది.

ఆమె భర్త చిన్నబజారులో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. నాగేశ్వరరావుకు చిన్నతనం నుంచే  దైవభక్తి ఎక్కువకావడంతో పిల్లలిద్దరూ జీవితంలో స్థిరపడ్డాక దంపతులిద్దరూ పుణ్యక్షేత్రాలు సందర్శించుకోసాగారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వారు కారులో తిరుమలకు వెళ్లారు. శనివారం ఉదయం స్వామివారి దర్శించుకున్న అనంతరం నెల్లూరుకు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో పెళ్లకూరు మండలం గుర్రప్పతోట వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. 

దీంతో నాగేశ్వరరావు, సులోచనమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న కుమారుడు, కుమార్తె, బంధువులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, దంపతులిద్దరి మృతదేహాలు చూసి బోరున విలపించారు. వారి మరణంతో పప్పులవీధిలోని దత్తాత్రేయ అపార్ట్‌మెంట్‌ వద్ద విషాధచాయలు అలముకున్నాయి. స్నేహితులు, బంధువులు ఒక్కొక్కరిగా అక్కడకి చేరుకుంటున్నారు. కాగా శనివారం రాత్రికి నాగేశ్వరరావు, సులోచనమ్మల మృతదేహాలు నెల్లూరుకు చేరుకోనున్నాయి. ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు.

డ్రైవింగ్‌పై పట్టు
నాగేశ్వరరావుకు డ్రైవింగ్‌ మీద మంచిపట్టు ఉందని, ఎంతో చాకచక్యంగా డ్రైవింగ్‌ చేసేవాడని ఆయన స్నేహితులు అంటున్నారు. ఆలయాల సందర్శనకు వెళ్లిన ప్రతిసారి డ్రైవర్‌ను వెంటబెట్టుకుని వెళ్లేవారని, అయితే కొద్దిరోజులుగా ఆయనే డ్రైవింగ్‌ చేస్తున్నాడని పేర్కొంటున్నారు. తమ స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.   

మరిన్ని వార్తలు