ఏమయ్యిందో ఏమో ..

27 Aug, 2015 01:53 IST|Sakshi
ఏమయ్యిందో ఏమో ..

దంపతులు బలవన్మరణం
కుటుంబ కలహాలే కారణమన్న బంధువులు
అనాథగా మిగిలిన కుమారుడు

 
చిత్తూరు (అర్బన్): ఏమయ్యిందో ఏమో గానీ... మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ‘ నా భార్య ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. రండి నాన్న..’ అంటూ ఫోన్ చేసిన వ్యక్తి తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి అతను కూడా నిర్జీవంగా వేలాడుతూ కనిపించాడు. మూడేళ్ల కుమారుడు వచ్చీరానీ మాటలతో ‘మా అమ్మానాన్న చనిపోయారు..’ అంటూ వచ్చిన వాళ్లకందరికీ చెబుతుండటం కన్నీరు తెప్పించింది. చిత్తూరు నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా..

చిత్తూరు నగరంలోని గిరింపేటకు చెందిన గోపి(36)కి, తిరుపతి ఇంద్రానగర్‌కు చెందిన ఉమామహేశ్వరి(22)కి 2011లో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు బాలు ఉన్నాడు. గోపి నరహరిపేటలో మోటారు వాహన తనిఖీ అధికారి జగదీష్ వద్ద వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులు మిట్టూరులోని మెసానికల్ మైదానం సమీపంలో ఓ అద్దె ఇల్లు తీసుకుని కాపురముంటున్నారు. అయితే భార్యాభర్త చిన్న విషయాలకే గొడవ పడేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గోపి, అతని భార్య ఉమామహేశ్వరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. క్షణికావేశంలో ఓ గదిలోకి వెళ్లి తలుపేసుకుంది.  కొద్ది సేపు తరువాత గీపి తలుపు తీసి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందింది. జరిగిన విషయాన్ని గోపి తన తండ్రికి ఫోన్‌లో చెప్పాడు. కంగారుతో వచ్చిన గోపి తండ్రి ఇంట్లో తలుపు తెరచి చూడగా.. ఓ వైపు కోడలు ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతోంది. మరోవైపు కన్న కొడుకు మరో గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని శవమై కనిపించాడు.

కాగా మనవడు బాలు నిద్రపోతున్నాడు. చిన్నపాటి సమస్యకే ఆత్మహత్య చేసుకుంటారా అంటూ రోదిం చారు. సమాచారాన్ని పోలీసులకు చెప్పడంతో వన్‌టౌన్ ఎస్‌ఐ తేజోమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బుధవారం ఉదయం మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పోలీసుల విచారణ అనంతరం ఆత్మహత్యకు గల కారణాలు వెలుగులోకి రానున్నాయి.
 
 

మరిన్ని వార్తలు