మరణంలోనూ తోడుగా..

18 Jun, 2015 00:27 IST|Sakshi
మరణంలోనూ తోడుగా..

మనసున మనసై ప్రేమించుకున్నారు.. బతుకున బతుకై జీవించారు.. కడదాకా తోడుండాలన్న పెళ్లినాటి ప్రమాణాలను నిజం చేస్తూ కొద్ది సమయం తేడాతో ప్రాణాలు విడిచారు.. ఇది ఇద్దరు అనురాగమూర్తుల ప్రేమ బంధం.. వారిది ఆదర్శప్రాయమైన అపురూప దాంపత్యం. అందుకే భర్త లేడన్న కఠోర వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయిందామె. నీ వెంటే నేనంటూ అనంత లోకాలకు పయనమైంది. ప్రముఖ వైద్యుడు పైడిరాజు, ఉపాధ్యాయిని మేరీరాణిల మరణం జిల్లావాసుల మనసులను కదిలించింది.
 
- ప్రేమతో ఒక్కటై... తుది పయనంలోనూ తోడు నీడగా...
- అనకాపల్లిలో దంపతుల అకాల మరణం
- గుండెపోటుతో డాక్టర్ పైడిరాజు...
- షాక్‌తో భార్య రాణి అమరలోకాలకు...
అనకాపల్లి:
ఆంధ్ర వైద్య కళాశాలలో ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ పైడిరాజు (54), మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న మేరీ రాణి (53) ముప్ఫై ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  తమ సేవలతో సంఘం లో మంచిపేరు తెచ్చుకున్నారు. పరిపూ ర్ణ జీవితం అనుభవించి, ఒకేసారి తను వు చాలించారు. మంగళవారం అర్ధరాత్రి
 భర్త అకాల మరణాన్ని తట్టుకోలేక మేరీ రాణి అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు హడావుడిలో ఉండగానే నిశ్శబ్దంగా తుది శ్వాస విడిచారు. ఈ రెండు విషాదాలను తట్టుకోలేక వారి పిల్లలు, బంధువులు, స్నేహితులు, సహాధ్యాయులు, శిష్యులు కన్నీరు మున్నీరయ్యారు.

కడసారి వీడ్కోలు పలికేందుకు వేలాదిగా తరలివచ్చారు.అనకాపల్లి నర్సింగరావుపేటలో కాపురం ఉంటున్న డాక్టర్ పైడిరాజు బుధవారం రాత్రి 11.45 నిమిషాలకు గుండెపోటుతో  కన్నుమూశా రు. మధుమేహ రోగి అయిన మేరీ రా ణి తీవ్ర ఆయాసానికి గురవ్వడంతో.. కుదుటపడేందుకు ఇంజక్షన్ చేసి పడుకోబెట్టారు. భర్త మరణంతో ఆమె ఒత్తిడికి గురవుతుందని భావించి.. అటువైపు తిప్పి గోడపక్కన ఆమెను పడుకోబెట్టారు. పైడిరాజు మృతదేహాన్ని రాత్రి రెండున్నర గంటల సమయంలో బయటకు తీసుకువస్తున్నప్పుడు ఆమెను లే పేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యు లు షాక్ తిన్నారు. ఆమె తుది శ్వాస విడిచారని తెలుసుకొని గొల్లుమన్నారు.   
 
మాటలకందని అనురాగం
వీరికి కుమారుడు ప్రదీప్, కుమార్తె పద్మిని సంతానం. ప్రదీప్ ఎంబీబీఎస్ చేసి, తండ్రి నిర్వహిస్తున్న నర్సింగ్‌హోమ్‌లోనే వైద్య సేవలందిస్తున్నారు. పైడిరాజు, రాణిల సొంత ఊరు అనకాపల్లి పట్టణమే. విశాఖలోని ఆంధ్ర మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న పైడిరాజు ఇటీవల అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్‌గా పదోన్నతి పొందారు. ఫోరెన్సిక్ మెడికల్ విభాగాధిపతిగా ఇటీవల  బాధ్యతలు స్వీకరించారు. అనారోగ్యంతో పైడిరాజు వారం రోజులుగా సెలవులో ఉండగా మంగళవారం రాత్రి ఈ ఘోరం జరిగింది. 1977లో వైద్యునిగా విధుల్లో చేరిన పైడిరాజు శ్రీకాకుళం జిల్లా సీతమ్మపేటలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పటల్ సర్వీసెస్ గా, పాడేరు ఆస్పత్రిలో, అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలందించారు. పలు జర్నల్స్‌లో రచనలు చేశారు. మరణించిన నవజాత శిశువుల ఎముకల ద్వారా వారి వయస్సును నిర్ధారించడం, ఆత్మహత్యలుగా చిత్రీకరించిన కేసులను హత్యలుగా గుర్తించడం ఆయన ప్రత్యేకత.

ఆ కేస్‌స్టడీలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చింగ్ హెల్త్ సొసైటీ ప్రచురించింది. సౌత్ ఇండియన్ మెడికో లీగల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగిన వ్యక్తిగా పైడిరాజుకు గుర్తింపు ఉంది. రాణి  మునగపాక మండల పరిషత్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించి, హాస్టల్ ఫీజు, ఇతర ఫీజులను చెల్లించి సేవలందించే రాణి అంటే ఆమె పనిచేసిన పాఠశాలలోని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఎంతో అభిమానం. పైడిరాజు, రాణి లు మరణించారని తెలుసుకున్న వారి సన్నిహితులు, స్నేహితులు, బంధువులు వేలాదిమంది నర్సింగరావుపేటలోని స్వగృహానికి తరలివచ్చారు. పైడిరాజు దంపతులకు బుధవారం మ ద్యాహ్నం అంతిమయాత్ర నిర్వహించా రు. వీరి పార్థివ దేహాలను సందర్శించి న వారిలో ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, దాడి వీరభద్రరావు, పెదబాబు, దంతులూరి దిలీప్‌కుమార్, కొణతాల జగన్, కొణతాల మురళీకృష్ణ ఉన్నారు.  డాక్టర్లు, టీచర్లు, పట్టణ ప్రముఖులు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన పరిచయస్తులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు