కిడ్నీలు అమ్ముకున్నా కష్టం తీరలేదు

19 Feb, 2018 12:25 IST|Sakshi
తమ బ్లాక్‌ ముందు దీనంగా కూర్చుని ఉన్న భార్యాభర్తలు

విధి చేతిలో ఓడిన అభాగ్యులు వీరు..కుటుంబానికి పెద్దాయనను రోడ్డు ప్రమాదం అవిటి వాడిని చేస్తే.. నీలోసగమైన నేనున్నాను కదయ్యా అంటూ ఆమె ధైర్యం చెప్పింది. ఆ ధైర్యాన్ని చూసి కాలానికి కన్ను కుట్టినట్టుంది. ఆమె కాలూ విరిచేసింది. ఇద్దరు పిల్లలతోపాటు బతుకు భారం మోయాలి. ఇప్పుడు వారికే బతకడం భారమైంది. మెతుకు కరువైంది. పిల్లల భవిష్యత్‌ నిత్యం కన్నీరై కారుతోంది. అందుకే ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క కిడ్నీ అమ్మేశారు. భార్యాభర్తలిద్దరికీ ఒక్కొక్క కిడ్నీ, ఒక్కొక్క కాలు.. కుంగదీస్తున్న అనారోగ్యం..చిల్లిగవ్వలేని    దౌర్భాగ్యం.. కదిలిస్తే ఏడ్చి ఏడ్చి ఇంకిన కన్నీరు ఆదుకోండయ్యా అంటూ మళ్లీ ఉబికివస్తున్నాయి. ప్రతి గుండెనూ బరువెక్కిస్తున్నాయి.

చిట్టినగర్‌(విజయవాడ పశ్చిమం): దేవరకొండ కేశవరావు, వెంకటలక్ష్మిలు భార్యాభర్తలు. కేశవరావు హనుమాన్‌జంక్షన్‌ రైల్వే గేటు సమీపంలోని పేపరు మిల్లులో సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు.. ఓ రోజు డ్యూటీకి వెళ్లి వస్తుండగా గేటు వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో కేశవరావు కుడికాలు విరిగిపోయింది. కుటుంబం బాధ్యతను భార్య వెంకటలక్ష్మి భుజానికి ఎత్తుకుంది. భర్త సహకారంతో ముందుకు నడుస్తున్నారు. ఇద్దరి పిల్లలతో నెట్టుకొస్తోంది. అయినా ఆర్థిక బాధలు వెంటాడుతూనే ఉన్నాయి.

కొంత కాలానికి వెంకటలక్ష్మి ఇంటి ముందు ఉండగా పాము కాటు వేయడంతో ఆమె కుడి కాలు కూడా తీసేయాల్సి వచ్చింది. అప్పటి వరకు కష్టం అంటే తెలియని ఆ కుటుంబాన్ని కష్టాలు చుట్టుముట్టాయి. కాలు లేకపోయినా పని చేసేందుకు ఎవరి వద్దకు వెళ్లినా నీవు పనికి రావంటూ పంపేసేవారు.. చేతిలో పని లేకపోవడంతో అప్పు చేసి కిళ్లీ కొట్టు పెట్టాడు... అదీ సాగకపోవడంతో అప్పుల పాలయింది, ఆ కుటుంబం..  ఇక చేసేది లేక కిడ్నీ అమ్ముకుని అప్పులు తీర్చారు. కొంత కాలం బాగానే సాగింది... ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో వెంకటలక్ష్మి కూడా భర్త అడుగు జాడల్లో కిడ్నీని విక్రయించింది.

తరుచూ అనారోగ్యం...
కిడ్నీలు విక్రయించడంతో భార్యాభర్తలిద్దరి ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. కేశవరావుకు బైపాస్‌ సర్జరీ చేయడంతో కుటుంబ పరిస్థితి మరింత దీనస్థితికి చేరింది. హనుమాన్‌జంక్షన్‌ నుంచి నగరానికి వలస వచ్చిన కేశవరావు కుటుంబం ప్రస్తుతం జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీలో నివాసం ఉంటుంది. కుమార్తె వాణికి ఎలాగో ఓ ఇంటి దానిని చేశారు. కుమారుడు సాయికిరణ్‌ పాల ప్రాజెక్టు సమీపంలోని సయ్యద్‌ అప్పలస్వామి కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చదువుతూనే ఓ ఎలక్ట్రికల్‌ దుకాణంలో పని చేస్తున్నాడు. అక్కడ వచ్చే డబ్బులతో తల్లిదండ్రులిద్దరికి మందులు, ఇంటి ఖర్చులకు వెచ్చిస్తున్నారు. మాకు ఇళ్ల స్థలం కేటాయించి ఆదుకోవాలని కేశవరావు, వెంకటలక్ష్మి కోరుతున్నారు.

కళ్లను అమ్మాలని చూశాం
కుటుంబ ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం, కనీసం తినడానికి కూడా ఇబ్బందిగా ఉండటంతో ఓ సమయంలో కళ్లను కూడా అమ్మాలని చూశాం.. కళ్లను కొనే వారు హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీలోని నేత్ర వైద్యశాల ఉంటారంటే అక్కడు వెళ్లాం.. అయితే అప్పులు పెరిగాయే తప్ప.. మా కష్టం తీరలేదు.: కేశవరావు, వెంకటలక్ష్మి

మరిన్ని వార్తలు