నీవు లేక నేను లేను..

5 May, 2019 07:31 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసులు శ్రీనివాసులు, రాజ్యలక్ష్మి (ఫైల్‌)

సంతానం లేదన్న బాధతో భార్య ఆత్మహత్య 

భార్య లేని జీవితం వ్యర్థమంటూ భర్త బలవన్మరణం 

12 రోజుల వ్యవధిలో ఘటనలు 

బొమ్మలసత్రం: కష్టనష్టాల్లో భార్య తోడుగా ఉంటూ వచ్చింది. 20 ఏళ్లుగా తనను కంటికి రెప్పలా చూసుకుంది. అలాంటి ఆమె సంతానం కలగలేదన్న మానసిక వ్యథతో ఈ లోకం వీడింది. ఇంతకాలం తోడూ నీడగా ఉన్న భార్య మరణాన్ని భర్త జీర్ణించుకోలేకపోయారు. ‘నీవు లేని జీవితం వృథా’ అంటూ తనూ ఈ లోకాన్ని వీడారు. ఈ విషాదకర సంఘటన నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసులు(54), రాజ్యలక్ష్మి(45) దంపతులు నంద్యాలలోని సాయిబాబా నగర్‌లో కొంతకాలంగా నివాసముండేవారు.

శ్రీనివాసులు గోస్పాడు ఆంధ్రప్రగతి బ్యాంకులో క్యాషియర్‌. రాజ్యలక్ష్మి గృహిణి. వీరికి పెళ్లయి 20 ఏళ్లు గడిచినా సంతానం కలగలేదు. దీంతో ఆమె రోజూ దిగులు చెందుతూ ఉండేది. భర్త సర్దిచెబుతూ ఉండేవారు. అయితే..గత నెల 22న శ్రీనివాసులు బ్యాంకుకు వెళ్లిన తర్వాత ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణంతో శ్రీనివాసులు తీవ్రంగా కుంగిపోయారు. తీవ్ర వేదనలో ఉన్న ఆయన్ను పట్టణంలోనే నివాసముంటున్న సోదరుడు మనోహర్‌ రెండు రోజుల కిందట తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ కూడా భార్యను తలచుకుంటూ బాధపడేవాడు.

శనివారం బ్యాంకుకు వెళుతున్నానని సోదరునికి చెప్పి సాయిబాబానగర్‌లోని సొంతింటికి చేరుకున్నారు. సూసైడ్‌ నోట్‌ రాసి భార్య ఆత్మహత్య చేసుకున్న విధంగానే తనూ ఉరి వేసుకుని చనిపోయారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, భార్య రాజ్యలక్ష్మి లేని చోట తానూ ఉండలేనని, తన బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును గుడి నిర్మాణానికి వినియోగించాలని  సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. అలాగే తన అవయవాలు దానం చేయాలని కోరారు. దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
 

మరిన్ని వార్తలు