ఆ ఆర్డినెన్స్‌పై కోర్టులో కేసు వేద్దామా!

21 May, 2015 03:56 IST|Sakshi

లెఫ్ట్ పార్టీలు, హక్కుల సంఘాల చర్చలు
1986 నాటి సుప్రీం తీర్పు
ఏపీకి వర్తిస్తుందని అంచనా

 
హైదరాబాద్: భూసేకరణ చట్టం-2013లోని రెండు మూడు అధ్యాయాలను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడానికి ఊతమిచ్చిన కేంద్ర ప్రభుత్వ భూ సేకరణ చట్ట సవరణ ఆర్డినెన్స్‌పై ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేయాలని లెఫ్ట్ పార్టీలు, హక్కుల సంఘాలు యోచిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకురావాల్సిన ఆర్డినెన్స్‌ను కేంద్రం ఇప్పటికే రెండుసార్లు తీసుకువచ్చి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఈ సంఘాలు భావిస్తున్నాయి.

దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ వాస్తవ బాధితుల తరఫున పిల్ దాఖలు చేసే విషయమై సాధ్యాసాధ్యాలను సీపీఐ, సీపీఎం, రైతు సమాఖ్య, పీయూసీఎల్ నేతలు చర్చించారు.  మరోసారి హైదరాబాద్‌లో న్యాయప్రముఖులతో కలిసి చర్చించాలని నిర్ణయించారు. బిహార్ ప్రభుత్వానికి, డాక్టర్ డీసీ వాద్వాకు మధ్య నడిచిన కేసులో సుప్రీంకోర్టు 1986లో ఓ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. చట్టసభలు అస్తిత్వంలో ఉండి, నడుస్తున్నప్పుడు పదేపదే ఆర్డినెన్స్‌లు జారీ చేయడం చెల్లదన్నది ఆ తీర్పు సారాంశం.

మరిన్ని వార్తలు