మోపిదేవి తాత్కాలిక బెయిల్‌పై కోర్టు నిర్ణయం 17న

14 Aug, 2013 00:22 IST|Sakshi

వెన్నునొప్పి దృష్ట్యా శస్త్రచికిత్స చేయిం చుకునేందుకు వీలుగా 3 నెలలపాటు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు 17న నిర్ణయాన్ని వెలువరించనుంది. మోపిదేవి పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌రావు మంగళవారం విచారించారు.

మోపిదేవి ఎస్కార్టు మధ్య ఆసుపత్రిలో చేర్చి శస్త్రచికిత్స చేయించేందుకు అభ్యంతరం లేదని, అందుకు తాత్కాలిక బెయిల్ ఇవ్వనక్కర్లేదని సీబీఐ ప్రత్యేక పీపీ సురేంద్ర నివేదించారు. అయితే వీలైనంత త్వరగా మోపిదేవికి శస్త్రచికిత్స చేయాలని ఉస్మానియా వైద్యుల మెడికల్ బోర్డు నిర్ధారించిందని ఆయన తరఫు న్యాయవాది సురేందర్‌రావు తెలిపారు.

తొలుత వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ చేయాల్సి ఉందని, తరువాతే శస్త్రచికిత్స చేస్తారన్నారు. పోలీసుల ఎస్కార్ట్ మధ్య ఉంటే మోపిదేవికి మానసిక ఆందోళన కలుగుతుందన్నారు. అందువల్ల మోపిదేవికి 3 నెలల తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని, కోర్టు విధించే షరతులు పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని విన్నవించారు.

మరిన్ని వార్తలు