కోర్టు తీర్పుతో సభకు సంబంధం లేదు

18 Mar, 2016 02:59 IST|Sakshi
కోర్టు తీర్పుతో సభకు సంబంధం లేదు

శాసన సభవ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోకూడదు : బొండా ఉమ వ్యాఖ్య
అసెంబ్లీ అధికారాలపై హైకోర్టు, సుప్రీంకోర్టులు సలహాలివ్వవు: ఎమ్మెల్యే అనిత


హైదరాబాద్: కోర్టు ఇచ్చిన ఆర్డర్‌తో శాసనసభకు సంబంధం లేదని ప్రభుత్వ విప్ బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ..  శాసనసభా వ్యవహారాలు, హక్కులు చాలా పరిమితమైనవని చెప్పారు. శాసనసభ వ్యవహరాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా ఉందన్నారు. రోజా సస్పెన్షన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పునకు, వైఎస్సార్‌సీపీ సభ్యులు మాట్లాడుతున్న దానికి పొంతన లేదన్నారు. రోజా సస్పెన్షన్ స్పీకర్ తీసుకున్న నిర్ణయం కాదని.. ఇది సభ తీసుకున్న నిర్ణయమని చెప్పారు.

కోర్డు ఇచ్చిన ఆర్డర్‌ని పరిశీలించి సభ పవిత్రతను కాపాడతామని స్పష్టం చేశారు. శాసనసభ వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య ఎవరి పరిధులు వాళ్లవని మరో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే వి.అనిత ఆరోపించారు. అసెంబ్లీకి పూర్తి అధికారాలు ఉంటాయని, ఈ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు సలహాలివ్వవని చెప్పారు. సభలో బలం ఉన్న వాళ్లదే రాజ్యమని ఆమె పేర్కొన్నారు. సభలో స్పీకర్, సీఎం, మంత్రులు, సభ్యులు ఎవర్నీ వదిలిపెట్టకుండా ఎమ్మెల్యే రోజా చేసిన అనుచిత వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ మరిచిపోయినా ప్రజలు మరిచిపోలేదన్నారు. తన విషయంలో చేసిన వ్యాఖ్యలకు రోజా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
 
 

>
మరిన్ని వార్తలు