శ్రీనివాసరావుకు జ్యుడిషియల్‌ రిమాండ్‌

18 Jan, 2019 14:19 IST|Sakshi

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం చేసిన జనుపల్లి శ్రీనివాసరావుకు ఎన్‌ఐఏ కోర్టు ఈ నెల 25 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. దర్యాప్తుకు రాష్ట్ర పోలీసులు, సిట్‌ అధికారులు సహకరించడం లేదని ఎన్‌ఐఏ దాఖలు చేసిన మెమోపై వాదనలు ఈనెల 23న వింటామని పేర్కొంది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఎన్‌ఐఏ, సిట్‌ అధికారులను ఆదేశించింది. (ఎన్‌ఐఏకు సిట్‌ సహాయ నిరాకరణ)

వారం రోజుల ఎన్‌ఐఏ కస్టడీ ముగియడంతో శ్రీనివాసరావుకు అంతకుముందు అధికారులు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత అతడిని కోర్టులో హాజరుపరిచారు. ఎన్‌ఐఏ అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయమూర్తి అడగ్గా.. ఏం లేదని శ్రీనివాసరావు సమాధానమిచ్చాడు. మీడియాతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలన్న నిందితుడి విజ్ఞప్తిని తిరస్కరించారు. శ్రీనివాసరావుకు విజయవాడలో భద్రత లేదని అతడి తరపు న్యాయవాది సలీమ్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాదిని వివరణ కోరగా రక్షణ కల్పించలేమని ఒప్పుకున్నారు. దీంతో నిందితుడిని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పటిష్ట భద్రత నడుమ నిందితుడిని రాజమండ్రికి తీసుకెళుతున్నారు. (ఎన్‌ఐఏ విచారణకు హర్షవర్ధన్‌ గైర్హాజరు)

మరిన్ని వార్తలు