అత్యాచారం కేసులో ఏడేళ్ల జైలు

14 Aug, 2019 08:59 IST|Sakshi

సాక్షి, తిరుపతి: ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో తిరుపతి రూరల్‌ జీవకోన క్రాంతినగర్‌కు చెందిన కుసునూరు చరణ్‌కుమార్‌కు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి రాంగోపాల్‌ మంగళవారం తీర్పు చెప్పారు. జరిమానా సొమ్ము రూ.25 వేలులో రూ.20వేలు బాధిత యువతికి చెల్లించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కోర్టు మానిటరింగ్‌ అధికారులు, కోర్టు కానిస్టేబుల్‌ రమేష్‌  కథనం మేరకు గంగాధర నెల్లూరు మండలానికి చెందిన 19 సంవత్సరాల యువతి స్థానిక ఎస్వీ మెడికల్‌ కళాశాలలోని డీఎంఎల్టీ సెకండ్‌ ఇయర్‌ కోర్సు చదువుతూ స్థానిక ఎమ్మార్‌పల్లెలోని ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్‌లో ఉండేవారు. చరణ్‌కుమార్‌ అదే కళాశాలలో మొదటి సంవత్సరం చదివి మధ్యలో చదువు ఆపేశాడు. ఆ యువతి వెంట ఇతడు ప్రేమ పేరుతో రోజూ వెంటపడేవాడు. 2011 ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 8.45 ప్రాంతంలో ఆ యువతి కళాశాలకు నడిచి వెళుతుండగా చరణ్‌కుమార్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌ సమీపంలో వెంబడించాడు.

తన ఇంట్లో పూజా కార్యక్రమం ఉందని, తనతో రావాలని తిరిగి వదిలి పెడతానని చెప్పాడు. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. అయితే అతడు మాయమాటలు చెప్పి బలవంతంగా ద్విచక్ర వాహనంలో టౌన్‌ క్లబ్‌ సమీపంలోని ఇంటిలోకి ఆమెను తీసుకెళ్లాడు. ఆ ఇంటి యజమాని టీ గిరి, అతని బంధువు కే నాగరాజ సహాయంతో ఆమెకు కూల్‌డ్రింక్స్‌లో మత్తుమాత్రలు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు గంటల తర్వాత మత్తు వదలిన ఆ యువతిని గిరి ఆటోలో హాస్టల్‌కు పంపాడు. బాధితురాలు ఈ సంఘటన విషయాలను ఇద్దరు స్నేహితురాళ్లకు, హాస్టల్‌ వార్డన్‌కు తెలిపింది. తరువాత కూడా నిందితుడు చరణ్‌కుమార్‌ బాధిత యువతికి ఫోన్‌చేసి విషయాన్ని ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించాడు. బాధితురాలు ఈ మేరకు  స్థానిక వెస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు గిరి, నాగరాజపై నేరం రుజువుకాకపోవడంతో వారిపై కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు చరణ్‌కుమార్‌పై అత్యాచారం కింద కేసు నిరూపణ కావడంతో అతనికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. 

మరిన్ని వార్తలు