కవర్డ్‌ కండక్టర్ల కుంభకోణంలో సీఎంవో

22 Feb, 2019 02:21 IST|Sakshi

దొరను తప్పించి... అసలు దోషులను రక్షించే యత్నం 

విజిలెన్స్‌ కమిషన్‌ సిఫార్సు చేసినా నిందితులపై కేసులు పెట్టని ప్రభుత్వం 

విచారణకు అడ్డుపడుతున్న ముఖ్యమంత్రి కార్యాలయం 

సాక్షి, అమరావతి: తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో వెలుగు చూసిన రూ.131 కోట్ల కవర్డ్‌ కండక్టర్ల కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) జోక్యం  తెరపైకి వస్తోంది. ఇందులో ముఖ్యమంత్రి సన్నిహిత అధికారుల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. కేసును పక్కదారి పట్టించి, అసలు దోషులను రక్షించడానికే ఈపీడీసీఎల్‌ సీఎండీ హెచ్‌వై దొరతో బలవంతంగా రాజీనామా చేయించారని విద్యుత్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. కవర్డ్‌ కండక్టర్ల కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌(ఫైనాన్స్‌) నేతృత్వంలో ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. తవ్వేకొద్దీ పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 

అసలేం జరిగింది? 
ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకునేందుకు వీలుగా డిస్కమ్‌ల పరిధిలో కవర్డ్‌ కండక్టర్స్‌(తొడుగు తీగలు) వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన టెండర్లను 2016లో ఎస్పీడీసీఎల్‌ పిలిచింది. అయితే, కేవలం ఒకే ఒక్క కంపెనీకి టెండర్‌ దక్కేలా నిబంధనలను రూపొందించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బెంగుళూరు కేంద్రంగా పనిచేసే రేచమ్‌ ఆర్‌పీజీ ప్రైవేట్‌ లిమిటెడ్, శ్రీసాయి ఎలక్ట్రికల్‌ ఎంటర్‌ప్రైజెస్, ఫ్రంట్‌లైన్‌ ఎలక్ట్రికల్స్‌ అనే సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో ఎల్‌–1గా నిలిచిన రేచమ్‌ ఆర్‌పీజీ సంస్థకు టెండర్‌ అప్పగించారు. అయితే, ఈ మూడు కంపెనీలకు డిపాజిట్‌ డీడీలను ఒకే అకౌంట్‌ నుంచి తీసినట్టు విచారణలో బయటపడింది. దీన్నిబట్టి ఈ మూడు కంపెనీలు ఒకే వ్యక్తివనే అనుమానాలు బలపడుతున్నాయి. రూ.131 కోట్ల విలువైన కవర్డ్‌ కండక్టర్ల పనులను కేవలం ఓ డిస్కమ్‌ సీఎండీ అప్పగించేందుకు వీల్లేదని, దీని వెనుక ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి ఉందనే సందేహాలు తలెత్తాయి. 

విజిలెన్స్‌ నివేదిక బుట్టదాఖలు 
కవర్డ్‌ కండక్టర్లను స్వీడన్‌ నుంచి తెప్పించామని పేర్కొంటూ కాంట్రాక్టు సంస్థ బిల్లులు సమర్పించింది. వీటిని గుజరాత్‌లోనే కేవలం రూ.64.52 కోట్లకు కొన్నట్టు విజిలెన్స్‌ విచారణలో బయటపడింది. కానీ, కాంట్రాక్టు సంస్థ ఏకంగా రూ.195.83 కోట్ల మేర బిల్లులు సమర్పించింది. ఆ మేరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించేసింది. రూ.131.30 కోట్ల మేర అదనంగా చెల్లించారని విజిలెన్స్‌ విభాగం తేల్చింది. 2016లో జరిగిన ఈ కుంభకోణంపై 2018 జూన్‌లో విజిలెన్స్‌ విభాగం నివేదిక ఇచ్చింది. కాంట్రాక్టు సంస్థకు అదనంగా చెల్లించిన సొమ్మును వెంటనే రాబట్టాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. వాస్తవానికి ఈ కేసులో రాజీనామా చేసిన హెచ్‌వై దొర హయాంలో చెల్లించిన బిల్లులు కేవలం అడ్వాన్స్‌ మాత్రమే. ఆ తర్వాత ఆయన పదవీ కాలం ముగిసింది. ఎస్పీడీసీఎల్‌ సీఎండీగా ఎంఎం నాయక్‌ బాధ్యతలు చేపట్టారు. విజిలెన్స్‌ నివేదిక తర్వాత ఆయన కాంట్రాక్టు సంస్థకు బిల్లులు ఇవ్వకుండా తొలుత నిరాకరించినట్టు తెలిసింది. కానీ, ïసీఎంవో ఒత్తిడి చేయడంతో కాంట్రాక్టు సంస్థకు బిల్లులన్నీ చెల్లించక తప్పలేదు. 

సన్నిహితుడిదే పెత్తనం 
సీఎంవోలో కీలకమైన ఓ ఐఏఎస్‌ అధికారికి అత్యంత సన్నిహితుడినని చెప్పుకునే వ్యక్తి కవర్డ్‌ కండక్టర్స్‌ విషయంలో మొదటి నుంచీ అత్యుత్సాహం చూపిస్తున్నట్టు అధికార వర్గాలు చెçపుతున్నాయి. వాస్తవానికి టెండర్‌లో పాల్గొన్న సంస్థలు కూడా అతడి నేతృత్వంలోనే నడుస్తున్నాయని తెలిసింది. సీఎంవోలోని ఐఏఎస్‌ అధికారి బినామీ సొమ్మును ఇతర మార్గాల్లో విదేశాలకు చేరవేయడంలో ఈయన పాత్ర ఉంటుందని చర్చ జరుగుతోంది. కవర్డ్‌ కండక్టర్లు సరఫరా చేసిన కంపెనీకి బిల్లులన్నీ చెల్లించేలా అధికారులపై ఆయన ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. రూ.131 కోట్ల కుంభకోణం జరిగిందని, దోషులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ కమిషన్‌ సిఫార్సు చేస్తే ఇంతవరకూ ఎవరిపైనా ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయ సిబ్బంది ప్రమేయం ఉండటం వల్లే కేసులు పెట్టే సాహసం చేయలేకపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.   

మరిన్ని వార్తలు