వదంతులు కూత వేసే... పౌల్ట్రీ పల్టీ కొట్టె!

20 Mar, 2020 11:25 IST|Sakshi

సంక్షోభంలో కోళ్ల పరిశ్రమ

‘కోవిడ్‌’ భయంతో పడిపోయిన అమ్మకాలు  

తగ్గిన గుడ్ల వినియోగం పతనమైన చికెన్‌ ధరలు  

చికెన్‌ తినొచ్చని అధికారులు అవగాహన కల్పిస్తున్నా పరిస్థితుల్లో కనిపించని మార్పు

కర్నూలు(అగ్రికల్చర్‌): కోడి మాంసం, గుడ్లు తింటే కరోనా(కోవిడ్‌) వైరస్‌ వ్యాపిస్తుందని సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరగడంతో కోళ్ల పరిశ్రమ కుదేలైంది. బతికి ఉన్న కోడి కిలో రూ.30 ప్రకారం ఇస్తామన్నా వినియోగదారులు ముందుకు రావడం లేదు. కరోనా వైరస్‌ వెలుగులోకి రాకముందు గుడ్లకు మంచి ధర ఉండేది. నేడు డిమాండ్‌ పడిపోయింది. కుదేలైన కోళ్ల పరిశ్రమ కోలుకోవడానికి ఎన్ని నెలలు పడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో పడిపోవడంతో దాణాగా వినియోగించే మొక్కజొన్న, జొన్న ధరలు నేలను తాకుతున్నాయి. 

80 శాతం పైగా పడిపోయినఅమ్మకాలు....
‘కోవిడ్‌’ భయాందోళన నేపథ్యంలో జిల్లాలో కోడిమాంసం, గుడ్ల అమ్మకాలు 80 శాతం పైగా పడిపోయాయి. గతంలో బర్డ్‌ప్లూ వంటి వ్యాధులు కోళ్ల పరిశ్రమపై కొంత ప్రభావం చూపాయి. నేడు ‘కోవిడ్‌’పై దుష్ప్రచారం..కోళ్ల పరిశ్రమ ఉనికినే దెబ్బతీసింది. ధరలు పడిపోవడంతో ఇప్పటికే రైతులు కోళ్ల ఉత్పత్తిని నిలిపివేశారు.  జిల్లాకు ప్రధానంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కోళ్లు, గుడ్లు వస్తున్నాయి.  జిల్లా జనాభా 45 లక్షలకుపైగా ఉండగా..ఇందులో మాంసాహార ప్రియులు 75 శాతం వరకు ఉన్నారు. ‘కోవిడ్‌’ భయం లేక మునుపుఆదివారం 6 లక్షల కిలోల వరకు చికెన్‌ అమ్మకాలు జరగేవి. ప్రస్తుతం ఆదివారం జిల్లా వ్యాప్తంగా 90 వేల కిలోల అమ్మకాలు కూడా జరగుడం లేదు. పోషక విలువలను పెంపొందించుకునేందుకు గుడ్లు ఎక్కువగా తినమని డాక్టర్‌లు సూచించేవారు. గతంలో రోజుకు 5 నుంచి 6 లక్షల గుడ్లఅమ్మకాలు జరిగేవి.. నేడు లక్ష కంటే తక్కువకు పడిపోయాయి. చికెన్, గుడ్లు తినడం వల్ల ‘కోవిడ్‌’ వైరస్‌ విస్తరించే అవకశమే లేదని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తున్నా... వినియోగదారుల్లోని భయం తొలగిపోవడం లేదు. కర్నూలులో చికెన్‌ ధరలు రూ.150 నుంచి రూ.200 వరకు ఉండేవి. బయటి ప్రాంతాల్లో రూ.120 నుంచి రూ.150 వరకు ఉన్నాయి. నేడు  కర్నూలులో కిలో రూ.100 పలుకుతోంది. ఇతర ప్రాంతాల్లో కిలో రూ.30 నుంచి 60 వరకు మాత్రమే పలుకుతోంది.  వంద గ్రుడ్ల ధర గతంలో రూ. 480 ఉండగా... నేడు రూ.280కి తగ్గిపోయాయి. అమ్మకాలు లేకపోవడంతో గుడ్లు మురిగిపోతున్నాయి.  

కొనేవారు లేరు
తెలంగాణ రాష్ట్రం నుంచి గుడ్లు దిగుమతి చేసుకుంటాం. గతంలో వారానికి 10 వేలు అమ్మేవారం. కరోనా వైరస్‌ ప్రచారం మొదలైంది మొదలు అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. ఇంత దయనీయమైన పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు. వ్యాపారం పడిపోవడంతో బాడుగలు కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది.  – మద్యయ్య, గుడ్ల వ్యాపారి, వెల్దుర్తి

మరిన్ని వార్తలు