ఉత్సవాలకు నో ఎంట్రీ

18 Mar, 2020 12:53 IST|Sakshi
అరసవల్లిలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన హ్యాండ్‌వాష్, శానిటైజర్లు

ఆలయాలపై కరోనా ఆంక్షలు

పర్వదినాల్లో భక్తులకు ప్రవేశం లేదు

సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి నిరాకరణ

‘సాక్షి’తో దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌ భద్రాజీ

అరసవల్లి: కోవిడ్‌–19 (కరోనా వైరస్‌) వ్యాప్తి చెందకుండా ఆలయాల్లో భక్తుల కదలికలపై దేవదాయ శాఖ ఆంక్షలు అమలు చేయనుంది. అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కరోనా ఎఫెక్ట్‌పై దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌ వై.భద్రాజీ మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ... జిల్లాలో వివిధ ఆలయాల్లో భక్తుల రద్దీ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలియజేశారు. జిల్లాలో అత్యధికంగా భక్తుల సందర్శనలున్న అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయంతోపాటు శ్రీకూర్మం, పాలకొండ, శ్రీముఖలింగం, రావివలస, కోటబొమ్మాళి, పాతప ట్నం తదితర ప్రముఖ ఆలయాల్లో పర్వదినాల్లో భక్తుల దర్శనాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఈ నెల 25న ఉగాది రోజున పంచాంగ శ్రవణంతోపాటు వచ్చేనెల 2న శ్రీరామనవమి ఉత్సవాలను ఎక్కడా భక్తుల జన సందోహంతో కలిసి నిర్వహించకుండా చర్యలు చేపడతామని ప్రకటించారు.

వచ్చే నెల 4న అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి వార్షిక కల్యాణం కూడా భక్తులతో కాకుండా కేవలం శాస్త్రం ప్రకారం అర్చక స్వాములతోనే నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇలాంటి పర్వదినాల్లో అవసరమైతే లైవ్‌ ద్వారా భక్తులు ఇంటి నుంచే టీవీల్లో చూసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వీటితో పాటు జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగే గుళ్ల సీతారాంపురంలో కూడా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నామని, ఇక్కడ కూడా ఈసారి భక్తులు లేకుండా అర్చకులే ఉత్సవాలు నిర్వహిస్తారని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త అమావాస్య రోజున అమ్మవారి పండుగల పేరుతో దాదాపుగా జిల్లాలోని అన్ని మండలాల్లోనూ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారని, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని, కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజల్లో కూడా అవగాహనరావాలని కోరారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఇప్పటికే అన్ని ఆలయాల్లో ప్రత్యేక ద్రవాన్ని పిచికారి చేయిస్తున్నామని, ఎప్పటిక ప్పుడు ఆలయ క్యూలైన్లు శుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలియజేశారు.  
ఆదిత్యుని ఆలయంలో హ్యాండ్‌వాష్,   శానిటైజర్ల ఏర్పాటుఅరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు ప్రారంభించారు. మంగళవారం నుంచి ఆలయ పరిసరాల్లో ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్‌ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణాలతోపాటు భక్తుల రాకపోకలుండే ప్రాంతాల్లో సోడియం హైపో ఫ్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు క్యూలైన్ల రాడ్లను కూడా లైజోల్‌ ద్రావణంతో తుడిచే ప్రక్రియను చేపట్టారు. భక్తుల కోసం శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌ ఏర్పాటు చేశారు. ప్రసాదాల తయారీ, అన్నదాన మండపాల్లో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగుల బయోమెట్రిక్‌ హాజరును కూడా రద్దు చేశారు. సిబ్బంది విధిగా మాస్కులు ధరించి విధులు నిర్వర్తించేలా చర్యలు చేపడుతున్నారు. నిత్యాన్నదాన పథకంలో కూడా భక్తుల చేతి వేలిముద్రలను సేకరించే విధానాన్ని కూడా నిలిపివేశారు. 

నేడు భక్తులకు మందుల పంపిణీ
బుధవారం అరసవల్లి ఆలయంలో ఆయుష్‌ ఆధ్యర్యంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్‌ తెలిపారు. శిబిరంలో భక్తులకు కరోనా రాకుండా మందులు పంపిణీ చేస్తారని చెప్పారు. ఉత్సవాలకు భక్తులను అనుమతించడం లేదని, వచ్చే నెలలో వార్షిక కల్యాణాన్ని లోకల్‌ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అరసవల్లి ఆలయానికి దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారని, అందుకే ముందుగా అప్రమత్తమైనట్టు చెప్పారు.  

మరిన్ని వార్తలు