5 వేల పడకలతో కోవిడ్‌ ఆస్పత్రి

30 Mar, 2020 10:18 IST|Sakshi

జిల్లా కేంద్రంలో నిర్మాణానికి స్థలాలను గుర్తించండి

అధికారులకు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశం

అనంతపురం అర్బన్‌: ‘‘అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మనమంతా సంసిద్ధంగా ఉండాలి. జిల్లా కేంద్రంలో 5 వేల పడకలతో కోవిడ్‌–19 ఆస్పత్రిని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం అవసరమైన స్థలాలను గుర్తించండి’’ అని కలెక్టర్‌ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోవిడ్‌ ఆస్పత్రి ఏర్పాటుకు మాల్స్, సూపర్‌మార్కెట్లు, కల్యాణ మండపాలు, ఇంజనీరింగ్‌ కళాశాలలు తదితర ప్రాంతాల్లో పరిశీలన చేసి స్థలాన్ని గుర్తించాలన్నారు. ఒకే చోట ఎక్కువ స్థలం లేకపోతే రెండుమూడు ప్రాంతాలనైనా గుర్తించాలని జేసీ–2 రామమూర్తిని ఆదేశించారు.

విదేశాల నుంచి హిందూపురం, పుట్టపర్తి ప్రాంతాలకు వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వీరందరినీ ఏప్రిల్‌ 14 వరకు  పర్యవేక్షణలో ఉంచాలని పెనుకొండ సబ్‌కలెక్టర్‌ నిశాంతిని ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన వారు, వారి కుటుంబీకులు, వారు ఎవరితోనైనా కలిసి ఉంటే వారినీ గుర్తించి కోవిడ్‌ పరీక్షలు చేయించాలన్నారు. ఇక విదేశాల నుంచి 860 మంది జిల్లాకు వచ్చినట్లు గుర్తించామన్నారు. వారు ఇంటి నుంచి బయటకు రాకుండా గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. ఆర్డీఓలు తమ డివిజన్‌ పరిధిలో ఎంత మంది విదేశాల నుంచి వచ్చారనేది తెలుసుకోవడంతో పాటు వారి వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వారంతా కచ్చితంగా హోం క్వారంటైన్‌లో ఉండేలా కఠినంగా వ్యవహరించాలని సూచించారు.  
 

మరిన్ని వార్తలు