కరోనా: జనతా కర్ఫ్యూ.. ఏపీలో బస్సులు బంద్‌!

21 Mar, 2020 12:58 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చింది. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నామని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని శనివారం తెలిపారు. కరోనాపై ప్రధాని మోదీ ‘జనతా కర్ఫ్యూ’ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని  వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఈరోజు (శనివారం) రాత్రి నుంచే నిలిపివేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
(చదవండి: జనతా కర్ఫ్యూకు ఇలా సిద్ధమవుదాం)

ప్రైవేటు బస్సుల యజమాన్యాలు కూడా సహకరించాలని, విజ్ఞప్తి చేశారు. దీనిని వ్యాపారంగా మార్చుకుని ప్రైవేటు ట్రావెల్స్‌, ఆటోలు ప్రజల వద్ద నుంచి అధిక వసూళ్లకు పాల్పడవద్దని చెప్పారు. విదేశాల నుంచే కరోనా వ్యాప్తి అధికంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి.. విదేశాల నుంచి వచ్చినవారు 15 రోజులు స్వీయ నిర్బంధాన్ని పాటించకుండా.. బయట తిరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపును అందరం బాధ్యతగా పాట్టిద్దామని అన్నారు.
(చదవండి: 22న జనతా కర్ఫ్యూ)

మరిన్ని వార్తలు