-

కరోనా కేసులు తగ్గుముఖం!

8 Apr, 2020 03:30 IST|Sakshi

సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం

రాత్రి 9 గంటల వరకు నమోదైన కేసులు

ఢిల్లీ ఎఫెక్ట్‌ మొదలైన తర్వాత అతితక్కువ కేసులు నమోదు

మొత్తం 314కు చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య

గుంటూరు జిల్లాలో కొత్తగా 9 కేసుల నమోదు

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో నలుగురి మృతి

పూర్తిగా కోలుకుని ఆరుగురు డిశ్చార్జ్‌

సాక్షి, అమరావతి: కొద్ది రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కరోనా వైరస్‌ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన సంకేతాలు కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం రాత్రి 9 గంటల వరకు కేవలం 11 కేసులు మాత్రమే నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 314కు చేరుకుంది. వారం రోజుల నుంచి ఒక్కసారిగా రాష్ట్రంలో కోవిడ్‌ కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. ఢిల్లీ సదస్సుకు వెళ్లి వచ్చిన వారికి కరోనా వైరస్‌ సోకడంతో వారందరినీ క్వారంటైన్‌కు పంపించి పరీక్షలు చేయడంతో కరోనా కేసులు పెరిగాయి. 

– మార్చి నెలాఖరు వరకు రోజుకు ఒకట్రెండు కేసులు నమోదవుతున్న రాష్ట్రంలో ఒక్కసారిగా కేసులు రెండంకెల స్థాయిలో నమోదు కావడం మొదలైంది. 
– మార్చి 30న రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 23. ఆ తర్వాతి రోజు (మార్చి31న) రాష్ట్రంలో కొత్త కేసులు 21 నమోదయ్యాయి. ఆ మరుసటి రోజే (ఏప్రిల్‌ 1న) రికార్డు స్థాయిలో 67 కొత్త కేసులు వచ్చాయి. ఆ తర్వాత అదే స్థాయిలో నమోదు కాకపోయినా.. కొత్త కేసుల నమోదు సంఖ్య రెండంకెల నుంచి తగ్గలేదు. 
– ఈ నేపథ్యంలో మంగళవారం 11 కేసులు నమోదు కావడం చూస్తుంటే కొత్తగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి వచ్చినవారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారందరినీ పరీక్షించడం దాదాపు పూర్తి కావడంతో రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు.

గుంటూరులో 9 కేసులు
– మంగళవారం గుంటూరు జిల్లాలో 9 కేసులు నమోదు కావడంతో ఆ జిల్లాలో కేసుల సంఖ్య 41కి చేరింది.  దీంతో పాటు నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఒక్క  కేసు కూడా నమోదు కాలేదు. 
– కాగా, కరోనా వైరస్‌కు చికిత్స పొంది విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున, కృష్ణా జిల్లాలో ఇద్దరు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 
– ఇప్పటి వరకు కరోనా వల్ల నలుగురు మరణించారు. ఇందురో ఇద్దరు కృష్ణా జిల్లా వాసులు కాగా, ఒకరు అనంతపురం, మరొకరు కర్నూలు జిల్లా వాసి ఉన్నారు. 
– కర్నూలు జిల్లా వాసి.. ఢిల్లీ నిజాముద్దీన్‌కు వెళ్లొచ్చిన వారితో కలిసి తిరిగాడు. 45 ఏళ్ల ఈ వ్యక్తి మృతి చెందాక పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. దీంతో అతనికి వైద్యం చేసిన డాక్టర్లు, సిబ్బందితో పాటు అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యులు, ఇతరులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.  
 
వెంటిలేటర్లు ఇవ్వండి
– రోగులకు అత్యవసర సమయంలో అవసరమైన వెంటిలేటర్స్‌ను రాష్ట్ర, జిల్లా స్థాయిలో కోవిడ్‌ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్న వెంటిలేటర్లను స్వచ్ఛందంగా ఇవ్వాలని కోరింది. 
– ఈ వెంటిలేటర్లకు అద్దె చెల్లించడానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. తీసుకున్న వెంటిలేటర్లను తిరిగి సురక్షితంగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రజా రోగ్య సంరక్షణలో భాగంగా వెంటిలేటర్లను ఇవ్వడం ద్వారా సామాజిక బాధ్యతను నెరవేర్చుకోవాలని విజ్ఞప్తి చేసింది. 

మరిన్ని వార్తలు