ఏపీలో 111 కరోనా పాజిటివ్‌ కేసులు 

2 Apr, 2020 03:22 IST|Sakshi

బుధవారం ఒక్కరోజే కొత్తగా 67 నమోదు

వీరిలో అత్యధికులు ఢిల్లీ నుంచి వచ్చిన వారే

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 కేసులు నమోదు

వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య బుధవారం రాత్రికి 111కు చేరుకుంది. బుధవారం ఒక్కరోజే 67 కొత్త కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ భాగం ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారేనని తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో ఇప్పటి వరకు చేసిన పరీక్షల్లో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగడం తెలిసిందే.

మన రాష్ట్రం నుంచి ఢిల్లీకి మత ప్రార్థనలకు వెళ్లిన వారిని ఇరాన్, ఇండోనేషియా నుంచి వచ్చిన వారు కలవడం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందని భావిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 11 జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎలాంటి కేసులు లేకపోవడం ఊరటనిస్తోంది. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చినవారు ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరిని కలిశారో తెలుసుకోవడానికి మున్సిపల్, ఆరోగ్య శాఖలతోపాటు పోలీసు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.  
 
రాష్ట్రంలో పరిస్థితులు ఇలా.. 
– ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేని వైఎస్సార్‌ జిల్లాలో బుధవారం ఒకేరోజు 15 పాజిటివ్‌ కేసులు నమోదు 
– ప్రకాశం జిల్లాలో కూడా 15 కేసుల నమోదు 
– అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 195 నమూనాలను ల్యాబ్‌కు పంపారు. 
– పాజిటివ్‌ కేసులు వచ్చిన వారి సన్నిహితులు, కలిసినవారు క్వారంటైన్‌కు తరలింపు 
– హోం ఐసోలేషన్‌లో ఉన్న వారి ఇళ్ల వద్ద పహారా తిరుగుతున్న ప్రభుత్వ సిబ్బంది 
లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా పాటించేలా క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు 
– అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో జనరల్‌ మెడిసిన్, పల్మనాలజీ వైద్యులు 
– పీజీ వైద్య విద్యార్థులు, నర్సులు ఐసీయూ వార్డుల్లో పనిచేసేలా శిక్షణ 
– కడప, అనంతపురం, విశాఖపట్నం లేబొరేటరీలను త్వరలో ప్రారంభించేందుకు కసరత్తు 

>
మరిన్ని వార్తలు