ఏపీలో మరో కరోనా పాజిటివ్‌

24 Mar, 2020 04:15 IST|Sakshi

విశాఖలో మూడో కరోనా కేసు

రాష్ట్రంలో 7కు చేరిన పాజిటివ్‌ కేసులు  

సాక్షి, విశాఖపట్నం/అమరావతి: విశాఖ జిల్లాలో సోమవారం మరో కరోనా  కేసు నమోదైంది. జిల్లాలోని పద్మనాభం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. లండన్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న యువకుడు ఈ నెల 17న స్వగ్రామానికి వచ్చాడు. అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఈ నెల 20న విశాఖ నగరంలోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆస్పత్రిలో చేర్చారు. ఆ యువకుడి నుంచి సేకరించిన నమూనాలను పరీక్ష కోసం పంపించగా.. సోమవారం కరోనా పాజిటివ్‌ అని రిపోర్టు వచ్చింది. దీంతో విశాఖ జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు మూడుకు చేరాయి. 

ఏడుకు చేరిన పాజిటివ్‌ కేసులు 
విశాఖ జిల్లాలో తాజాగా సోమవారం నమోదైన కేసుతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏడుకు చేరినట్లు ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. ఇప్పటివరకూ 181 మంది వైరస్‌ లక్షణాలున్న అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి ల్యాబొరేటరీలకు పంపించామని, అందులో 7 మందికి పాజిటివ్‌ రాగా.. 166 మందికి కరోనా లేదని వెల్లడించింది. మరో 8 కేసులకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉందని తెలిపింది.  

విదేశీ ప్రయాణికులు 14 రోజులు ఇంట్లోనే ఉండాలి 
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు విధిగా 14 రోజులు ఇంట్లోనే ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. సర్కారు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై అంటువ్యాధుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలున్న వారు కనిపిస్తే 104కు కాల్‌చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.  

తొలి కరోనా యువకుడి డిశ్చార్జి 
క్షేమంగా ఇళ్లకు చేరుకున్న మరో నలుగురు అనుమానితులు 
నెల్లూరు (అర్బన్‌): రాష్ట్రంలోనే తొలి కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) పాజిటివ్‌ కేసుగా నమోదైన యువకుడు పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు సోమవారం డిశ్చార్జి చేశారు. నెల్లూరు నగరానికి చెందిన విద్యార్థి ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లి తిరిగి వచ్చాడు. కరోనా అనుమానిత లక్షణాలు బయటపడటంతో అతన్ని ఈ నెల 6న ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ప్రత్యేక కరోనా వార్డులో చేర్చి ప్రత్యేక చికిత్సలు చేశారు. వైద్యం కొనసాగిస్తూనే.. రెండు దఫాలుగా అతడి నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌ టెస్ట్‌ చేయించారు. రెండుసార్లూ నెగెటివ్‌ రిపోర్టు రావడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు అతన్ని సోమవారం డిశ్చార్జి చేసి ఇంట్లో వదిలి పెట్టారు. మరో 14 రోజులు హోం ఐసోలేషన్‌ పాటించాలని సూచించారు.

ఆ విద్యార్థితో పాటు ఇటలీ నుంచి వచ్చిన మరో విద్యార్థి కూడా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా.. అతడికి నెగెటివ్‌ వచ్చింది.  ఇటీవల గమేషా పరిశ్రమ నుంచి ఒక ఉద్యోగి, పాజిటివ్‌ వచ్చిన విద్యార్థికి షేవింగ్‌ చేసిన బార్బర్‌ను ప్రత్యేక వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహించారు. ఈ ముగ్గురికీ ప్రారంభ పరీక్షల్లోనే నెగెటివ్‌ రిపోర్టులు వచ్చాయి. అయినప్పటికీ ప్రత్యేక వార్డులోనే ఉంచి పరిశీలించారు. ఆ ముగ్గురూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటంతో వారిని కూడా సోమవారం డిశ్చార్జి చేశారు. అనుమానంతో ప్రత్యేక వార్డులో ఉంచిన ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌ మేనేజర్‌ను కూడా డిశ్చార్జి చేశారు. 

ప్రభుత్వమే నన్ను కాపాడింది  
కరోనా వైరస్‌ సోకిన తనకు సత్వరం మెరుగైన చికిత్స అందించి ప్రభుత్వమే తన ప్రాణాలు కాపాడిందని రాష్ట్రంలో కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్న విద్యార్థి చెప్పాడు. అతడు మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తాను ఇటలీ నుంచి వచ్చాక ప్రభుత్వ అధికారులు తనను కలిశారని, తనకు జాగ్రత్తలు తెలిపారని వీడియోలో పేర్కొన్నాడు. అప్పటికి తనకు ఎలాంటి లక్షణాలు లేవని, రెండు రోజుల తర్వాత దగ్గు రావడంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపాడు. వెంటనే స్పందించి పెద్దాస్పత్రిలోని ప్రత్యేక వార్డులకు తరలించారన్నాడు. అప్పటి నుంచి తనకు ధైర్యం చెబుతూ తనను చాలా బాగా చూసుకున్నారని తెలిపాడు. ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి తన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుందన్నారు. ప్రభుత్వ రంగంలో తనకు మంచి వైద్యం లభించిందన్నారు. పారిశుద్ధ్యం కూడా చాలా బాగా చేశారన్నాడు.  

కరోనా కట్టడికి పురపాలక శాఖ కంట్రోల్‌ రూం 
అందుబాటులో టోల్‌ఫ్రీ నంబర్‌ 180059924365  
కరోనా వైరస్‌ కట్టడికి సంబంధించి ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు పురపాలక శాఖ ప్రత్యేకంగా కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసింది. టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కరోనా వైరస్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యలను ఈ కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షిస్తారు. పారిశుధ్య నిర్వహణ, ఇతర అంశాలను పురపాలక శాఖ దృష్టికి తేవడానికిగానీ ఏమైనా సలహాలు, సూచనల కోసం ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్‌  జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు.  

పన్నులు ఆన్‌లైన్‌లో చెల్లించండి  
పట్టణాలు, నగరాల్లోని ప్రజలు ఆస్తిపన్ను, ఇతర పన్నులను ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలని పురపాలక శాఖ కోరింది. ప్రస్తుతం కరోనా కట్టడికి రాష్ట్రమంతా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు కార్యాలయాలకు రాకుండా ఉండాలని పురపాలక శాఖ కోరింది. పన్నుల చెల్లింపునకు మార్చి 31తో తుది గడువు. కాగా పరిస్థితిని సమీక్షించిన మీదట పన్నుల చెల్లింపు గడువు పొడిగించే విషయాన్ని పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు