15 నిమిషాల్లోనే కరోనా ఫలితం

10 Jul, 2020 11:17 IST|Sakshi

అత్యవసర రోగులకు ర్యాపిడ్‌ టెస్ట్‌లు

జిల్లాకు 1,900 కిట్లు

కర్నూలు(హాస్పిటల్‌): అత్యవసర వైద్యం కోసం వచ్చిన వారు కోవిడ్‌–19 టెస్ట్‌ ఫలితం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పనిలేదు. ఇకపై కేవలం 15 నిమిషాల్లో ఫలితం తెలుసుకుని చికిత్స అందించే విధంగారాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కోవిడ్‌–19 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కిట్‌లోని స్వాబ్‌తో మొదట ముక్కులో నుంచి జిగురును పరీక్ష కోసం తీస్తారు. దానిని కిట్‌లోని లిక్విడ్‌లో మూడుసార్లు తిప్పి, ఆ స్వాబ్‌కు అతుక్కున్న మూడు చుక్కల ద్రవాన్ని కిట్‌పై వేస్తారు. 15 నిమిషాల అనంతరం ఫలితం వెల్లడవుతుంది. కిట్‌పై రంగు మారితే కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారిస్తారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు, ప్రసవాలు, ప్రమాదాల చికిత్స కోసం వచ్చిన వారికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు మొదటి విడతగా జిల్లాకు 1,900 కిట్లు పంపారు. వీటిని కర్నూలు జీజీహెచ్‌ స్టేట్‌ కోవిడ్‌ సెంటర్‌(పెద్దాసుపత్రి), నంద్యాల జిల్లా ఆసుపత్రి, ఆదోని మాతాశిశు కేంద్రంతో పాటు  జిల్లాలోని 18 కమ్యూనిటి హెల్త్‌ సెంటర్లకు పంపిణీ చేశారు. గురువారం నుంచే ఈ కిట్ల ద్వారా అత్యవసర రోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కిట్‌ ద్వారా పాజిటివ్‌ వస్తే అతనికి కరోనా ఉన్నట్లు నిర్ధారిస్తామని  కోవిడ్‌ పరీక్షల నోడల్‌ అధికారి డాక్టర్‌ మోక్షేశ్వరుడు చెప్పారు. ఒకవేళ రోగికి జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉండి, అతనికి నెగిటివ్‌ ఫలితం వచ్చినా మళ్లీ ఆ వ్యక్తికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేస్తారన్నారు. 

మరిన్ని వార్తలు