6 లక్షలకు చేరువలో కోవిడ్‌ టెస్టులు

18 Jun, 2020 05:01 IST|Sakshi

వారంలోనే లక్ష పరీక్షలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌

ప్రతి పది లక్షల మందిలో 11,207 మందికి పరీక్షలు

కొత్తగా 351 మందికి కరోనా పాజిటివ్‌

మొత్తం కేసుల సంఖ్య 7,071

సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ మరో రికార్డుకు దగ్గరలో ఉంది. ఆరు లక్షల మార్కుకు కేవలం అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 15,188 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడం ద్వారా ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 5,98,474కి చేరింది. ఈ నెల 11న 5 లక్షల మార్కు చేరిన వారంలోనే మరో లక్ష పరీక్షలు నిర్వహించడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో ప్రతి పది లక్షల మంది జనాభాకి 11,207 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలుస్తోంది.

కొత్తగా 351 మందికి కరోనా సోకడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,071కి చేరింది. ఇందులో 5,555 కేసులు మన రాష్ట్రానికి చెందినవి కాగా, 1,253 ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు, 263 విదేశాల నుంచి వచ్చిన వారివి ఉన్నాయి. 128 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,641కు చేరింది. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 90కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,340గా ఉంది.

కరోనా నియంత్రణకు రూ.77.44 కోట్లు
కోవిడ్‌–19 నియంత్రణ చర్యల కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ రూ.77.44 కోట్లను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌–19ను జీవసంబంధమైన విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి రూ.77.44 కోట్లను ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు విడుదల చేసింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి బుధవారం జీవో జారీ చేశారు.

>
మరిన్ని వార్తలు