31 వరకు జిల్లా లాక్‌డౌన్‌

23 Mar, 2020 13:00 IST|Sakshi
నిర్మానుష్యంగా నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌

సరిహద్దులు మూసివేత

ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలి

జిల్లాకు వచ్చిన 880 మంది హోం క్వారంటైన్‌

నెల్లూరు(అర్బన్‌): కరోనా వైరస్‌ను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం 75 జిల్లాల్లో ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌ డౌన్‌ ప్రకటించింది. అందులో విశాఖ పట్నం, కృష్ణా, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి రాకుండా ఉండాలంటే ఎక్కడి వారు అక్కడే ఉండాలని (ఐసొలేషన్‌) నిర్ణయించింది. తద్వారా వైరస్‌ కలిగిన వారి నుంచి మరొకరికి సోకకుండా కట్టడి చేయగలమని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అందులో భాగంగా అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసేశారు. ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేయనున్నారు. తమిళనాడు నుంచి నెల్లూరు వచ్చే తడ చెక్‌ పోస్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నిత్యావసరాలు మినహా మిగతా వ్యాపార సంస్థలన్నింటిని మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారులెవరైనా అధిక ధరలకు సరకులు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఈ నెల 29న రేషన్‌ సరుకులు అందిస్తామని ప్రకటించింది. జిల్లాలో సుమారు 8 లక్షల మందికి రేషన్‌ ఇవ్వడంతో పాటు ఒక కిలో కందిపప్పు అందనుంది.  ప్రతి కార్డు దారుడికి ఉచితంగా రూ.1000 ప్రభుత్వం ఇవ్వనుంది. పిల్లలు, ముసలి వారిని బయటకు పంపొద్దని కలెక్టర్‌ ప్రజలకు సూచించారు. 

మరిన్ని వార్తలు