సీపీ బదిలీ

7 Jul, 2015 01:04 IST|Sakshi
సీపీ బదిలీ

కొత్త కమిషనర్‌గా గౌతమ్ సవాంగ్
 
బెజవాడ పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త కమిషనర్‌గా ఏపీఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీ దామోదర్ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. సీపీ బదిలీ విషయాన్ని గతనెల 12నే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది.

ఇంటెలిజెన్స్‌కు సీపీ బదిలీ
విజయవాడ సిటీ : విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా బదిలీ అయ్యారు. కొత్త పోలీసు కమిషనర్‌గా ఏపీఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీ దామోదర్ గౌతమ్ సవాంగ్ రానున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటుకు కోట్లు కేసులో ఇంటెలిజెన్స్ వైఫల్యంపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఎ.బి.వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమించినట్లు చెపుతున్నారు. గత నెల రోజులుగా ఆయన బదిలీపై ప్రచారం జరిగినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. ఈ నెల మూడో తేదీతో కోడ్ ముగియడంతో సోమవారం సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగానే ఎ.బి.వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులయ్యారు. గత ఏడాది ఆగస్టు ఎనిమిదిన పోలీసు కమిషనర్‌గా అదనపు డీజీ హోదాలో ఆయన విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. 11 నెలల వ్యవధిలో ఆయన తీసుకున్న పలు నిర్ణయాలను ప్రజలు ప్రశంసించగా, మరికొన్ని నిర్ణయాలు ప్రజలు, పొలిటికల్ వర్గాల్లో అసంతృప్తికి దారితీశాయి. ఆటంకాలను అధిగమిస్తూ ప్రభుత్వం వద్దనున్న పలుకుబడి ఉపయోగించి కమిషనరేట్‌లో పలు కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
 నిధుల లేమిని దృష్టిలో ఉంచుకొని నగర ప్రముఖులను భాగస్వాములను చేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సోమవారం పటమట టీచర్స్ కాలనీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మరికొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. దేశంలోనే అతిపెద్ద అమరావతి పోలీసు కమిషనరేట్‌కు ఎ.బి.వెంకటేశ్వరరావు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

 సంపూర్ణ సహకారం : సీపీ
 నగర పోలీసు వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ సహకారం లభించిందని సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు తెలిపారు. అందరి సహకారంతో చేయాలనుకున్న అన్నింటిని అమలు చేసినట్లు చెప్పారు. మరికొన్ని మధ్యలో ఉంటే, కొన్ని పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
 

మరిన్ని వార్తలు