'ఎంపీలందరూ రాజీనామా చేస్తేనే ప్రత్యేక హోదా'

4 Aug, 2015 17:55 IST|Sakshi

ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : రాజ్యసభ సభ్యులు సహా రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు కలసికట్టుగా రాజీనామాలు చేస్తే ఒక్క గంటలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన సమితి బస్సు యాత్రలో భాగంగా సీపీఐ నాయకుల బృందం రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ ఇంటిని మంగళవారం ఉదయం ముట్టడించింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. పార్లమెంటు రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించిన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని, వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా చేపడతామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ చెప్పారన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టి 14 మాసాలు గడిచినా ఏ ఒక్క అంశంపైనా మన ఎంపీలు ఒక్కరు కూడా పార్లమెంటులో మాట్లాడలేదన్నారు.

ప్రత్యేక హోదా వస్తుందంటే రాజీనామాకు సిద్ధమని ఎంపీ మురళీమోహన్ అంటున్నారని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని 25 మంది లోక్‌సభ సభ్యులు, 12 మంది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కావలసింది సినిమా డైలాగులు కాదన్నారు. 14 నెలలుగా నిద్రపోయారు. ఇప్పటికైనా పార్లమెంటు సమావేశాలు పూర్తయ్యేలోగా నరేంద్రమోదీతో స్పష్టమైన ప్రకటన చేయించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రిలో 12 రోజులు మకాం వేసినా రాష్ట్రానికి నష్టమేమీ జరగలేదని, పార్లమెంటు సమావేశాలు జరిగే ఈ నెల 13 వరకూ ఆయన ఢిల్లీలోనే ఉండి ఎంపీలందరినీ కూడగట్టుకుని ప్రత్యేక హోదా సాధించి రావాలని కోరారు. శ్రీకాకుళంలో బయలుదేరిన తమ బస్సు యాత్ర ఈ నెల 10న అనంతపురం జిల్లా హిందూపురంలో ముగుస్తుందన్నారు. ఆలోపు  నరేంద్రమోదీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని, లేకుంటే ఈ నెల 11న రాష్ట్ర బంద్ చేపడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు