నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం 

7 Jul, 2018 07:26 IST|Sakshi
ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సీపీఐ నాయకులు

డోన్‌ : విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా, రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ సీపీఐ కార్యకర్తలు శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.    సీపీఐ కార్యాలయం నుంచి పార్టీ నియోజకవర్గపు కార్యదర్శి రంగనాయుడు ఆధ్వర్యంలో ప్రదర్శనగా వచ్చిన కార్యకర్తలు అమ్మా హోటల్‌ వద్ద గుత్తి రహాదారి పై ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.  కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పార్టీ పట్టణ కార్యదర్శి నక్కిశ్రీకాంత్, నాయకులు నాగరాజు, నారాయణ, పులిశేఖర్, శివన్న, రంగన్న, నక్కిబాలమ్మ పాల్గొన్నారు.

ప్రధానికి పిండ ప్రదానం 
 రాష్ట్ర విభజన హామీలను ప్రధాని నరేంద్రమోడీ నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ  ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు  శుక్రవారం వినూత్న నిరసన తెలిపారు. ప్రధాని  చిత్రపటానికి పిండ ప్రదానం చేశారు. మండలంలోని అబ్బిరెడ్డిపల్లె చెరువు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా తూర్పు విభాగం అధ్యక్షులు శివశంకర్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివశంకర్‌ మాట్లాడుతూ ఇకనైనా బీజేపీ ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు