జేసీ దివాకర్‌ ఓ దొంగ

13 Jul, 2018 09:15 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న సీపీఐ డి.జగదీష్‌ (చిత్రంలో) సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌

అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

లేకుంటే తాడిపత్రిలో బహిరంగ సభ

వామపక్ష పార్టీల నాయకులు

అనంతపురం అర్బన్‌: అనంతపురం పార్లమెంట్‌ సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి ఓ దొంగ అని, తన దొంగతనాలు బయటపడకుండా ఉండేందుకు ఎదుటివారిని దొంగలంటున్నారని వామపక్ష పార్టీల నాయకులు ధ్వజమెత్తారు. గురువారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఎం ఉత్తర ప్రాంత కార్యదర్శి వి.రాంభూపాల్, సీపీఐ ఎంఎల్‌ ఎన్‌డీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన   మాట్లాడారు.

కమ్యూనిస్టులపై జేసీదివాకర్‌రెడ్డి దిగజారు వ్యాఖ్యలు చేయడం హేయమన్నారు. ‘ఎస్సీల పేరుతో బస్సులు కొనుగోలు చేసి రాయితీ సొమ్మును కాజేసిన మీరు దొంగలు కాదా? పర్మిట్లు లేని వాహనాలు తిప్పుతూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్న మీరు ఏ కోవకు చెందుతారో చెప్పండి. వీటిపై విచారణ చేయడానికి వచ్చిన అధికారులపై దౌర్జన్యం చేసిన మీరు.. కమ్యూనిస్టులను దొంగలనడం దయ్యాలు వేదలు వల్లించినట్లుగా ఉంది’ అంటూ విమర్శించారు. డీసీఎంఎస్‌లో నిధులను కాజేసిన విషయాన్ని జేసీ అప్పుడే మరిచిపోయారాని ఎద్ధేవా చేశారు.  ప్రజల సమస్యల పరిష్కారానికి నిజాయితీగా పోరాడుతున్న కమ్యూనిస్టులపై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.

జేసీ దివాకర్‌రెడ్డి వంటి వ్యక్తులను రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సొంత పార్టీ నాయకులుపై విపక్ష నేతలపై, కమ్యూనిస్టులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న జేసీ దివాకర్‌రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తాడిపత్రిలో బహిరంగ సభ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎంపీ అనుచిత వ్యాఖ్యలపై జిల్లావ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేస్తున్న కార్యకర్తల అరెస్ట్‌ను ఖండించారు. సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు సి.జాఫర్, పి.నారాయణస్వామి, మల్లికార్జున, రాజారెడ్డి, వేమయ్యయాదవ్, లింగమయ్య, బాలరంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు