అక్కడ మాటలు..ఇక్కడ దోపిడీ

30 Apr, 2015 23:36 IST|Sakshi
అక్కడ మాటలు..ఇక్కడ దోపిడీ

రైతుల పొట్ట కొట్టి జేబులు నింపుకుంటున్నారు
ప్రత్యేక హోదా, ఎన్నికల హామీలకు చెల్లుచీటీ
కేంద్ర,రాష్ర్టప్రభుత్వాలపై  సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం ద్వజం

 
విద్యానగర్(గుంటూరు) : కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ దేశాన్ని ఉద్ధరిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటుంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను లూఠీ చేస్తూ తమ జేబులు నింపుకుంటూ పాలన చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. గుంటూరులో గురువారం జరిగిన సీపీఐ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ దోపిడీ ప్రభుత్వాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు ప్రతి కమ్యూనిస్టు పోరాట జెండాలను పట్టాలన్నారు.

వ్యవసాయ ఆధారిత దేశంలో రైతులను నట్టేట ముంచుతూ చట్టాలను రూపొందిస్తున్నారన్నారు. పాలకులు రైతుల పొట్టను కొట్టి పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేసి జేబులు నింపుకుంటున్నాయని ఆరోపించారు. నరేంద్రమోదీ ప్రజల డబ్బుతో జల్సా చేస్తూ ఎన్నికల హామీలను మరిచిపోయారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 రోజుల్లో నల్లధనాన్ని దేశానికి రప్పిస్తామని చెప్పినా, ఇప్పటికి రూ.10 కోట్లయినా రప్పించలేకపోయారని ఎద్దేవా చేశారు.

పారిశ్రామికీకరణ పేరుతో పేదల భూములను లాక్కుంటున్నారేగాని ఒక్క భూస్వామి స్థలాన్ని తీసుకోలేదని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నేడు ఆ హోదాను ఇవ్వలేమని స్పష్టం చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో రుణమాఫీ, ఇంటికి ఓ ఉద్యోగం, డాక్రామాఫీ, నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలు చెప్పి ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.

కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు జల్లి విల్సన్, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, విజయవాడ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్, సీనియర్ నాయకులు జీవీ కృష్ణారావు, రాష్ట్ర సమితి సభ్యులు రాధాకృష్ణమూర్తి, కోట మాల్యాద్రి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు