సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ

6 Mar, 2015 03:15 IST|Sakshi
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ

విజయవాడ: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా కె.రామకృష్ణ గురువారమిక్కడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు రోజులుగా జరుగుతున్న పార్టీ రాష్ట్ర 25వ మహాసభలో ప్రతినిధులు నూతన కార్యవర్గాన్ని గురువారం రాత్రి పొద్దుపోయాక ఎన్నుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నికైన తొలి కార్యవర్గం ఇది. రాష్ట్ర విభజనతోపాటే పార్టీకీ రెండు శాఖలు ఏర్పాటైన నేపథ్యంలో గతేడాది జూన్‌లో కె.రామకృష్ణ లాంఛనంగా పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. మహాసభలో ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. వచ్చే మూడేళ్లకాలానికి ఈ కొత్త కార్యవర్గం బాధ్యతలు నిర్వహిస్తుంది.

96 మందితో రాష్ట్ర సమితి, పది మంది ప్రత్యామ్నాయ సభ్యులు, ఆరుగురితో కంట్రోల్ కమిషన్, 29 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. కాగా రాష్ట్ర కార్యదర్శి సహా తొమ్మిది మందితో కార్యదర్శివర్గం ఎంపికైంది. ఇందులో ముప్పాళ్ల నాగేశ్వరరావు(గుంటూరు), జేవీ సత్యనారాయణమూర్తి(విశాఖ)లు సహాయ కార్యదర్శులు కాగా.. పీజే చంద్రశేఖరరావు(ప్రకాశం), జెల్లి విల్సన్(కృష్ణా), రావుల వెంకయ్య(స్టేట్ సెంటర్-రైతు సంఘం), జి.ఓబులేసు(ఏఐటీయూసీ-ప్రజా సంఘాలు), ఈడ్పుగంటి నాగేశ్వరరావు(కృష్ణా జిల్లా), బి.హరనాథ్‌రెడ్డి(చిత్తూరు జిల్లా)లు కార్యదర్శివర్గ సభ్యులుగా ఎంపికయ్యారు.

మరిన్ని వార్తలు