సొంతకాళ్లపై నిలబడదాం!

16 Apr, 2015 03:59 IST|Sakshi

జాతీయ మహాసభలో సీపీఎం నిర్ణయం
జాతీయ స్థాయి పొత్తులు, కూటములు ఉండవు
రాష్ట్రస్థాయిలో పొత్తులపై నిర్ణయాధికారం రాష్ట్ర కమిటీలకే
దానికీ కొన్ని షరతులు..!!
బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేకతే ప్రాతిపదిక
లౌకికవాదం పేరిట ఎవరితో పడితే వారితో దోస్తీకి నై
రాజకీయ ఎత్తుగడల పంథాపై చర్చ

(విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): సీపీఎం ఇక ముందు జాతీయ స్థాయి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించదు.

ఆ స్థానంలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ప్రత్యామ్నాయానికి కృషి చేస్తుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కొన్ని షరతులు విధిస్తుంది. ఏ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే పార్టీకి, వామపక్ష సంఘటనకు లాభమో పరిగణనలోకి తీసుకునే అవకాశాన్ని రాష్ట్ర పార్టీ శాఖలకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. సీపీఎం 21వ జాతీయ మహాసభల రెండో రోజైన బుధవారం రాజకీయ ఎత్తుగడల పంథాపై చర్చించారు. కాగా, ఎత్తుగడలపై పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరిలు వేర్వేరు పంథాలు వెల్లడించడం గమనార్హం.  
 
కారత్ చెబుతున్న విధానం ఏమిటంటే..
లౌకిక శక్తులతో వ్యూహాత్మక ఎత్తుగడల పేరిట ఏ పార్టీతో పడితే ఆ పార్టీతో పొత్తులు వద్దు.
గతం మాదిరే.. మరింత ఉధృతంగా పోరాటాలు చేద్దాం. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో మాత్రమే పొత్తులు పెట్టుకుందాం.
యూపీ, బిహార్, ఏపీలో ప్రాంతీయ పార్టీలు,
కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని ఎంతో నష్టపోయిన మాట నిజం కాదా?.  
ఆ గుణపాఠాలను పరిగణనలోకి తీసుకుని పాత పద్ధతిలో పోరాటాలు చేద్దాం.
వామపక్షాలు చిన్నవా, పెద్దవా? అనే దాంతో నిమిత్తం లేకుండా
అన్ని గ్రూపుల్నీ ఏకం చేద్దాం.
కేరళలో వామపక్ష సంఘటన నుంచి ఆర్‌ఎస్పీ తప్పుకుని కాంగ్రెస్‌తో
కలవడం వల్ల ఎంఎ బేబీ సీటును కోల్పోవాల్సి వచ్చింది.
ఆ పార్టీ చిన్నదే కావచ్చు. మనం చెల్లించిన మూల్యం మాత్రం పెద్దది.
గత 25 ఏళ్ల అనుభవాలు చాలు. పొత్తులు వద్దు. ఇక సొంత కాళ్లపై నిలబడదాం.
స్వతంత్రంగా ఎదుగుదాం. మనమే ప్రత్యామ్నాయం అని నిరూపిద్దాం.
 
ఏచూరి వర్గం వైఖరి ఇదీ...
వామపక్ష, ప్రజాతంత్ర ఐక్య సంఘటనకు ప్రయత్నిస్తూనే భావసారూప్యత ఉన్న ప్రాంతీయ పార్టీలనూ కలుపుకొందాం.
ప్రాంతీయ, అస్తిత్వ ఉద్యమాలున్న ఈ సమయంలో అందర్నీ కాదనుకుంటే ఎలా?
మనం చెబుతున్న లాటిన్ అమెరికా, గ్రీస్ తదితర దేశాల్లో సైతం కమ్యూనిస్టులు స్వతంత్రంగా అధికారంలోకి రాలేదు.
అన్ని వామపక్ష గ్రూపులు, ప్రజాస్వామి కవాదులు కలిస్తేనే అధికారం వచ్చింది. మనమూ అదే పని చేయాలి.
ప్రాంతీయ పార్టీల్లో లౌకికత్వాన్ని సమర్థించేవాటితో పొత్తుపై నిర్ణయించే స్వేచ్ఛను రాష్ట్ర కమిటీలకు ఇవ్వాలి.
అవసరం మేరకు ప్రాంతీయపార్టీలతో పొత్తులు పెట్టుకునే అవకాశం ఉండాలి.
 
షరతులు వర్తిస్తాయి ‘సాక్షి’తో రాఘవులు
రాజకీయ ఎత్తుగడల పంథాపై రాఘవులు మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలతో పొత్తులపై కొన్ని షరతులుంటాయన్నారు.
ప్రాంతీయ పార్టీలు, లౌకిక బూర్జువా పార్టీలతో కలసి జాతీయస్థాయిలో పొత్తులుండవు.  వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన మాత్రమే జాతీయస్థాయిలో ఉంటుంది.
ఎన్నికల సమయంలో ఏ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో రాష్ట్ర కమిటీలే నిర్ణయిస్తాయి.
అయితే, మతతత్వానికి దూరంగా ఉంటూ, సరళీకృత ఆర్థిక విధానాలను వ్యతిరేకించాలి. ఉద్యమాల్లో కలసిరావాలి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ అవకాశవాద బూర్జువా పార్టీలే. వీటికి మా ఫ్రంట్‌లో చోటులేదు.
 
అందరూ అంగీకరిస్తున్న విధానాలు
సొంత పునాదులపైనే ఎదగాలి. వామపక్ష సంఘటనకు ప్రాధాన్యం ఉండాలి.
సైద్ధాంతిక నిబద్ధత పెరగాలి. అణగారిన వర్గాలకు దగ్గరవ్వాలి. మధ్యతరగతిని ఆకట్టుకోవాలి.
ఎన్నికల పొత్తులనేవి వామపక్ష ప్రజాతంత్ర శక్తులకు అనుక్రమణికగా ఉండాలే గానీ అవే ప్రధానం కాకూడదు.
ఈ ముసాయిదాపై చర్చలు గురువారం మధ్యాహ్నంతో ముగుస్తాయి. అనంతరం ప్రకాశ్ కారత్ సమాధానం ఇస్తారు.

మరిన్ని వార్తలు