తాడోపేడో తేల్చుకుందాం: కత్తి నరసింహారెడ్డి 

16 Jul, 2018 07:04 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న  ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

సీపీఎస్‌ రద్దుపై ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి 

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : రాష్ట్రవ్యాప్తంగా 2004 నుంచి అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌) రద్దుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తాడోపేడో తేల్చుకుంటామని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి పేర్కొన్నారు. సలాంఖాన్‌ ఎస్టీయూ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసినముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని కొనసాగించే విషయంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్‌ చేశారు.

సీపీఎస్‌ రద్దుపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సీపీఎస్‌ రద్దు కోసం ఎస్టీయూ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతామని, ఫ్యాప్టో, జేఏసీ ఆధ్వర్యాల్లోనూ వినూత్న పోరాటాలకు శ్రీకారం చుడతామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎంఎండీ షఫీ, ఉపాధ్యక్షుడు జి.నాగేశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.ప్రసాద్, నాయకులు ఈ.రాముడు, సుధీర్, సుబ్రమణ్యం, మల్లేశ్, జనార్ధన్, అజాంమేగ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు