సీపీఎస్‌ను రద్దు చేయకుంటే గుణపాఠం చెబుతాం

25 Jul, 2018 11:24 IST|Sakshi
ఫ్యాఫ్టో చైర్మన్‌ బాబురెడ్డి

ఒంగోలు టౌన్‌: రాష్ట్రంలోని లక్షా 86వేల మంది ఉద్యోగుల కోసం పనిచేస్తావా? షేర్‌ మార్కెట్‌ కోసం పనిచేస్తావా? ఈ విషయమై వెంటనే తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) చైర్మన్‌ పీ బాబురెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. ఉద్యోగుల జీవితాలను షేర్‌ మార్కెట్‌లో పెట్టి ముఖ్యమంత్రి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగుల ప్రయోజనాల కంటే షేర్‌ మార్కెటే ముఖ్యమనుకుంటే సీపీఎస్‌ ఉద్యోగులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఒంగోలు వచ్చిన సందర్భంగా స్థానిక యూటీఎఫ్‌ కార్యాలయంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణలో భాగంగా అమలుచేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో ఉద్యోగులు ఉద్యమిస్తున్నా పాలకులకు చీమకుట్టినట్లు లేదని విమర్శించారు. సీపీఎస్‌ విధానం వల్ల రాష్ట్రంలోని లక్షా 86వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేసిన తరువాత నష్టపోతారన్నారు. 2003 డిసెంబర్‌లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేసిందన్నారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వామపక్షాలు పార్లమెంట్‌లో, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు బయట అడ్డుకోవడంతో పదేళ్లపాటు సీపీఎస్‌ బిల్లు ఆగిపోయిందన్నారు. 2013లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కలిసి పీఎఫ్‌ఆర్‌డీఏ బిల్లు తీసుకువచ్చి దేశంలోని కోట్లాది మంది ఉద్యోగుల జీవితాలకు భద్రత లేకుండా చేశాయని ధ్వజమెత్తారు.

రూ. 700కోట్లు మిగులుతాయి
రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉందంటూ పదేపదే చెబుతున్న చంద్రబాబు సీపీఎస్‌ వల్ల 700 కోట్ల రూపాయలు షేర్‌ మార్కెట్‌లో ఎందుకు చెల్లించాలని బాబురెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఏడాది రూ.1000కోట్లు, ఆ తర్వాత 1500కోట్లు, ఇలా 2000కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. పీఎఫ్‌ఆర్‌డీఏతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయల కోసం కేంద్రంతో కొట్లాడేందుకు సిద్ధపడాలన్నారు. సీపీఎస్‌ రద్దుచేసి పాత పెన్షన్‌ పునరుద్ధరిస్తూ ప్రభుత్వం తీర్మానం చేయాలన్నారు. సీపీఎస్‌ రద్దుకు కొన్ని పార్టీలు హామీలు ఇస్తున్నాయని, అది ఆచరణాత్మక హామీ అయితే అసెంబ్లీలో, పార్లమెంటులో సీపీఎస్‌ రద్దుకు బిల్లును ప్రతిపాదించాలని సూచించారు.


క్విట్‌ సీపీఎస్‌తో జాతాలు
సీపీఎస్‌ విధానాన్ని అమలు చేసుకునే, రద్దు చేసుకునే వెసులుబాటు కేంద్రం కల్పించిన నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు క్విట్‌ సీపీఎస్‌ నినాదంతో ఫ్యాప్టో ఆధ్వర్యంలో జాతాలు నిర్వహించనున్నట్లు బాబురెడ్డి వెల్లడించారు. ఈనెల 30 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా జాతాలు ప్రారంభం అవుతాయన్నారు. సీపీఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగల జీవితాల్లో చీకటి రోజు నింపిన సెప్టెంబర్‌ 1వ తేదీ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపా«ధ్యాయులంతా మాస్‌ క్యాజువల్‌ లీవ్‌లు పెట్టి అన్ని కలెక్టరేట్లను ముట్టడించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

గుదిబండగా మారిన యాప్‌లు
ప్రభుత్వ ఉపాధ్యాయులకు యాప్‌లు గుదిబండగా బాబురెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 21రకాల యాప్స్‌ను ప్రతిరోజూ ఉపాధ్యాయులు నిర్వహించాల్సి వస్తోందని, దీంతో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలా, యాప్స్‌కు సమాధానం పంపుతూ ఉండాలా అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. విద్యార్థులకు సక్రమంగా పాఠాలు చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు.  ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకే ఇలాంటి విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. గతంలో యాప్‌లు లేకుండా పాఠశాలలు సక్రమంగా నిర్వహించలేదా, ఫలితాలు సాధించలేదా అని ప్రశ్నించారు. యాప్‌ల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కలిగించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు