సీపీఎస్‌ పథకమా.. సర్కారీ జూదమా!

2 Aug, 2018 08:25 IST|Sakshi

సాక్షి ప్రతినిధి కడప: ఉద్యోగులు దాచిపెట్టుకున్న డబ్బులను ప్రభుత్వం షేర్‌ మార్కెట్‌లో పెడుతోంది. షేర్‌ మార్కెట్‌ కూలితే ఇక ఉద్యోగుల పరిస్థితి అంతే సంగతులు. ఒక్క జూన్‌లోనే ప్రతి సీపీఎస్‌ ఉద్యోగి రూ.20–30 వేలు నష్టపోయాడు. అంటే ఉద్యోగుల డబ్బులతో సర్కారు ఆడుతున్న జూదంలో తమ ప్రమేయం లేకుండానే ఉద్యోగులు నష్టపోతున్నారన్న మాట. భవిష్యత్తులో ఈ నష్టాలు ఏ స్థాయిలో ఉంటాయోనని ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమపై బలవంతంగా రుద్దుతున్న సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) అమలు చేయాలని ఇటీవల కాలంలో ఉద్యోగులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు.

జిల్లాలో రెండు రోజుల జీపుజాతా
సీపీఎస్‌ విధానం 2004 సెప్టెంబరు 1వ తేదీ నుంచి అమలులో ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో దీనికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యమ దిశగా పయనిస్తున్నారు. ఉద్యోగ సంఘాలన్నీ సీపీఎస్‌కు వ్యతిరేకంగా సంఘటితమై ఫ్యాప్టోగా ఏర్పడి ఉద్యమ కార్యాచరణను రూపొందించాయి. ఇందులో భాగంగా జూలై 30 నుంచి ఆగస్టు 10వతేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలో ‘క్విట్‌ సీపీఎస్‌’ పేరుతో జీపు జాతా నిర్వహిస్తున్నారు. మన జిల్లాలో ఆగస్టు 2న పులివెందుల, రాయచోటి, రాజంపేట, కడపలలో, 3న బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల మీదుగా జీపు జాతా కొనసాగనుంది. ఈ జాతాలో ఉద్యోగులు తమ విధులకు సెలవు పెట్టి పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.

పెన్షన్‌ భిక్ష కాదు.. హక్కు
ఉద్యోగుల సేవలకు ప్రతిఫలంగా వారి పదవీ విరమణ అనంతరం మరణించే వరకు నెలనెలా పెన్ష న్‌ ఇవ్వాలన్నా పథకాన్ని నాటి బ్రిటీషు పాలకులే ఆరంభించారు. స్వాతంత్య్రం అనంతరం మన ప్రభుత్వాలు దానిని కొనసాగిస్తున్నాయి. 1982లో పెన్షన్‌ అనేది ఉద్యోగులకు ఇచ్చే భిక్ష కాదు...అది వారి హక్కు అంటూ సుప్రీంకోర్టు సైతం తీర్పునిచ్చింది. కానీ బ్రిటీషు పాలకుల కంటే క్రూరంగా 2004లో నాటి కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి ఆ స్థానంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. అప్పట్లో దీనికి పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలపడంతో బిల్లు చట్టరూపం దాల్చింది. 2004 సెప్టెంబరు 1 తర్వాత ఉద్యోగాలలో చేరిన వారు తమ జీతం నుంచే పదిశాతం డబ్బును ప్రభుత్వానికి పట్టిస్తే.. అంతే మొత్తం డబ్బులను ప్రభుత్వం జమచేసి షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతుంది.

ఈ డబ్బులే సదరు ఉద్యోగి పదవీ విరమణ పొందిన నాటి నుంచి తాను మరణించే వరకు పెన్షన్‌ రూపంలో అందుకుంటాడు తప్ప అతని సేవలకు ప్రతిఫలంగా ప్రభుత్వం ఇచ్చేది ఏమీ లేదన్న మాట. ఐదేళ్లపాటు పదవిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలే జీవితాంతం పెన్షన్‌ సౌకర్యాన్ని అనుభవిస్తుండగా, 20–30 సంవత్సరాలపాటు ప్రభుత్వానికి సేవలు అందించిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎందుకింత కఠినంగా వ్యవహారిస్తుందన్న ప్రశ్నకు పాలకుల నుంచి సమాధానం రావడం లేదు.

చక్రాయపేట మండలం కల్లూరుపల్లె తాండా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న దైవచిత్తం అనే ఉపా«ధ్యాయుడు 2010లో ఉద్యోగంలో చేరాడు. అప్రెంటీస్‌ పీరియడ్‌ పూర్తయిన తర్వాత 2012 నవంబరులో అతని ఉద్యోగం రెగ్యులర్‌ అయింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)లో భాగంగా నాటి నుంచి ప్రతినెల అతని జీతంలో 10శాతం డబ్బులను ప్రభుత్వమే పట్టుకుని, అంతే మొత్తాన్ని తాను కూడా జమ చేసి ఎన్‌ఎస్‌టీఎల్‌ అనే ఓ షేర్‌ మార్కెట్‌ సంస్థలో పెట్టుబడి పెడుతూ వస్తోంది. 2018 మార్చి 31వ తేదీ నాటికి అతని ప్రార్న్‌ అకౌంటులో రూ.4,05,343 మొత్తం నిల్వ ఉంది.

ఆ తర్వాతి మూడు నెలల్లో రూ.22,286 జమ అయింది. తిరిగి జూన్‌ 30న అతని అకౌంటును పరిశీలిస్తే అందులో రూ.4,02,907 మాత్రమే ఉంది. అంతే మార్చిలో నిల్వ ఉన్న డబ్బు కంటే జూన్‌లో కనీసం రూ.22 వేలు పెరగాల్సింది పోయి రూ.2,436 తగ్గిందన్న మాట. షేర్‌ మార్కెట్‌లోని ఒడిదుడుకుల వల్ల ఒక్క జూన్‌ నెలలోనే తాను దాచిపెట్టుకున్న డబ్బుల్లో రూ. 25వేల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
ఇది దైవచిత్తం ఒక్కడికే జరిగిన నష్టం కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సీపీఎస్‌ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం ఇది.

ఐక్య పోరాటమే శరణ్యం
సీపీఎస్‌ ఉద్యోగులందరూ ఒక్కతాటిపైకి రావాలి. ఐక్య పోరాటాలతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మెడలు వంచే సమయం ఆసన్నమైంది. సంఘాలకు అతీతంగా సీపీఎస్‌ ఉద్యోగులంతా సంఘటితమై ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి.
నాగేశ్వరరావు, సీపీఎస్‌ జిల్లా నాయకుడు

ఉద్యమాన్ని ఉ«ధృతం చేస్తాం
కార్పొరేట్‌ శక్తులకు తలొగ్గి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సీపీఎస్‌ను అమలు చేస్తున్నాయి. సీపీఎస్‌ను రద్దుచేయాలం టూ అన్ని ఉద్యోగ సంఘాలు నడుం బిగించాయి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలి. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం!

– లక్ష్మిరాజా, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

మరిన్ని వార్తలు