పేలుతున్న టపాసుల ధరలు

6 Nov, 2018 08:08 IST|Sakshi

అమాంతం పెరిగిన బాణాసంచా సామగ్రి ధరలు

అనుమతులు లేకున్నా దుకాణాల నిర్వహణ

చివరి రెండు రోజుల్లోనే అధిక విక్రయాలపై దృష్టి

అమ్మకాలు తగ్గడంతో వచ్చినవారి నుంచే గుంజేస్తున్న వైనం

జనావాసాల మధ్య దుకాణాలతో అవస్థలు

తారాజువ్వల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చిచ్చుబుడ్లు కాస్తా చెట్టెక్కి కూచున్నాయి. కాకరపువ్వొత్తుల్లో చుక్కలు కనిపిస్తున్నాయి. మతాబులు చూస్తేనే మండిపోతున్నాయి. అయినా ఏడాదికోసారి వచ్చే పండగకోసం... ఇంట్లో పిల్లల ఆనందం కోసం... ఎంతోకొంత వెచ్చించక తప్పదు. ఆ కారణంగానే దుకాణాలకు వెళ్లే వినియోగదారులపై ధరల మోత మోగుతోంది. అసలేఅమ్మకాలు లేక సతమతమవుతున్న వ్యాపారులు ఇదే అదనుగా వచ్చిన వారికే అధిక మొత్తానికి అంటగట్టి సొమ్ము చేసుకోవాలన్న తపన కనిపిస్తోంది. సందట్లో సడేమియాలా అనుమతుల్లేని దుకాణాలు పుట్టుకొచ్చేశాయి.

విజయనగరం గంటస్తంభం: దీపావళికి ఒక్కరోజే మిగిలి ఉంది. ఇప్పటివరకూ అంతంతమాత్రంగా సాగిన వ్యాపారం కనీసం ఈ రెండు రోజుల్లో పూర్తిచేయాలన్న లక్ష్యంతో వ్యాపారులు ఓ అడుగు ముందుకేసి ధరలు పెంచేశారు. గతేడాది కంటే 15 నుంచి 20శాతం పెరిగాయి. వ్యాపారులు పెరగలేదని చెబుతున్నా గతేడాది కొనుగోలు చేసిన సామగ్రి కొనుగోలు చేస్తే ఈ సారి ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం కాకరపువ్వొత్తులు సాధారణ రకం బాక్సు(10) రూ.50 ఉండగా పదేసి ఉండే చిచ్చుబుడ్లురూ.80 నుంచి రూ.100లు, తాళ్లు రూ.60, లక్ష్మీబాంబులు(చిన్నవి) రూ.20,1000వాలా రూ.450, 12సాట్స్‌ రూ.100, 60సాట్స్‌ రూ.600 వరకు ఉన్నాయి. ఇవి గతేడాది కంటే 15 నుంచి 20శాతం ఎక్కువే అని వినియోగదారులు చెబుతున్నారు. గతేడాది రూ.2000 లు సరుకు కొనేవారు ఇప్పుడు వాటికే రూ.2400ల వరకు వెచ్చిస్తున్నారు.

అనధికార అమ్మకాలజోరు
జిల్లా బాణాసంచా వ్యాపారానికి పెట్టింది పేరు. జిల్లానుంచే కాకుండా పొరుగున ఉన్న శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు, ఒడిశా రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడినుంచే సరకులు కొనుగోలు చేస్తుంటారు. ఇది చాలాకాలంగా వస్తున్నదే. ఈ నేపథ్యంలో జిల్లాలో పర్మినెంట్‌ లైసెన్స్‌ కలిగిన దుకాణాలు 12 ఉన్నాయి. వీటికి ఎక్స్‌ప్లోజివ్‌ శాఖ అనుమతులు ఇస్తుంది. ఈ దుకాణాల్లో ఏడాది పొడవునా వ్యాపారాలు సాగుతాయి. ఇక దీపావళి ముందు తాత్కాలిక లైసెన్సుతో వ్యాపారాలు చేసుకునేందుకు రెవెన్యూశాఖ అనుమతులిస్తుంది. ఇలా ప్రతి ఏడాది 80కు పైగా తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేస్తారు. ఇవిగాకుండా అనధికారికంగా మరో 30 నుంచి 40 దుకాణాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది సోమవారం నుంచి వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. కొందరు లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేస్తున్నారు. విజయనగరం పట్టణంలో ఆర్డీఓ సోమవారం సాయంత్రం వరకు 24 తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేస్తే ప్రస్తుతం ఒక్క కె.ఎల్‌.పురంలోనే 46 దుకాణాల్లో అమ్మకాలు జరుగుతుండడం విశేషం. కొత్తవలస, లక్కరవరపుకోట, ఎస్‌.కోట, గజపతినగరం, పూసపాటిరేగ మండలాలకు సంబంధించి 45 దుకాణాలకు అనుమతిస్తే అక్కడ 60కు పైగా ఉన్నాయి. పార్వతీపురం డివిజన్‌లో బొబ్బిలి, పార్వతీపురంలో మూడేసి, సాలూరులో ఒకటి తాత్కాలి లైసెన్సులు ఇచ్చారు. ప్రస్తుతానికి ఇక్కడ అనధికార షాపులు లేకపోయినా మంగళ, బుధవారాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

అమలు కాని నిబంధనలు
అనుమతులు ఇచ్చిన తాత్కాలిక వ్యాపారులు, హోల్‌సేల్‌ వ్యాపారులతో విజయగనరం ఆర్డీఓ జె.వి.మురళి, పోలీసు, ఫైర్‌ అధికారులు ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి నిబంధనల గురించి కచ్చితమైన సూచనలు చేశారు. కానీ తాత్కాలిక దుకాణదారులు మాత్రం చివరికి నిబంధనలు పాటించకుండా షాపులు పెట్టారు. కె.ఎల్‌.పురంలో రాజులకాలనీకి ఆనుకుని పదుల సంఖ్యలో షాపులు పెట్టారు. వాస్తవానికి ఇళ్లకు, షాపులకు మధ్య 50మీటర్లు దూరం ఉండాలి. మరోవైపు ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు అసలు లేవు. తాత్కాలిక షాపులు రేకులతో వేయాలని చెప్పినా టెంట్లుతో వేశారు. ఇసుక, నీరు బకెట్లు, డ్రైకెమికల్, అగ్ని మాపక పరికరాలు లేవు. ఇప్పటికే నిల్వలు అనుమతుల కంటే ఎక్కువ ఉన్నాయి.

పరిశీలించి అనుమతులిచ్చాం
స్థలాలు ముందే పరిశీలించాం. ఇళ్లకు వెళ్లేదారి కావడం, పక్కనే ఇల్లు ఉండడంతో ఒక ప్రదేశంలో పెట్టకూడదని చెప్పాం. ఇంకోచోట సూచించినా స్థల యజమాని అంగీకరించనందున జనావాసాలకు ఇబ్బంది లేకుండా పెట్టాలని సూచించాం. ఇళ్లకు 50మీటర్లు దూరంలో ఉండేలా చూసుకున్నాం. టేకు చెట్లు, ఇతర అడ్లు ఉన్నందున ఇబ్బంది ఉండదు. అనుమతి లేకుండా ఎక్కడైనా షాపులు పెట్టి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు కూడా పెడతాం.– జె.వి.మురళి,ఆర్డీవో, విజయనగరం

మరిన్ని వార్తలు