మైత్రీ కషాయం!

4 Feb, 2018 08:38 IST|Sakshi

బీజేపీ పుట్టి ముంచుతున్న టీడీపీ

పొత్తు ముసుగులో అణచివేత ధోరణి

మూడున్నరేళ్ల టీడీపీ పాలనలో     పెరిగిన అవినీతి

నోరు మెదపలేకపోతున్న బీజేపీ నేతలు

ఏ పనీ జరగట్లేదని కాషాయ నేతల కినుక

వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానం నుంచైనా బరిలో నిలవాలనే ఆశ

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉత్తర భారతదేశంలో హవా నడిపిస్తూ.. దక్షిణాదిన బలపడాలని చూస్తున్న బీజేపీ అనంతలో ఉనికి కోల్పోతోంది. గతంలో బీజేపీ తరపున కదిరి ఎమ్మెల్యేగా పార్థసారధి ప్రాతినిధ్యం వహించగా.. ఇప్పుడు ఆ ప్రాభవం కాస్తా చరిత్రలో కలిసిపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తరచూ టీడీపీతో దోస్తీ కట్టడం.. ఒంటరిగా పోటీ చేయలేకపోవడం.. పొత్తులో భాగంగా అనంతలో టిక్కెట్లు దక్కించుకోలేకపోవడం పార్టీ పరిస్థితి దిగజారేందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలోని బీజేపీ.. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలోనూ బలపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటని పరిశీలిస్తే.. టీడీపీతో దోస్తీ కారణంగా మరింత బలహీనపడిన విషయం ఆ పార్టీ శ్రేణులే అంగీకరిస్తున్నారు. అయితే టీడీపీతో పొత్తు కారణంగా ఆ విషయాన్ని బాహాటంగా వెల్లడించలేకపోతున్నారు. భారతీయ జనతాపార్టీ నుంచి పార్థసారధి కదిరి ఎమ్మెల్యేగా 1999లో గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా కదిరి స్థానం బీజేపీకి దక్కింది. ఆ ఐదేళ్లు కదిరితో పాటు జిల్లాలోనూ ఆ పార్టీ కాస్త హడావుడి చేసింది. స్వతంత్రంగా గెలిచే శక్తి, ఆ స్థాయి అభ్యర్థులు పార్టీకి లేకపోయినప్పటికీ కొంత ఓటు బ్యాంకును పోగు చేసుకోగలిగింది.

 2004లోనూ బీజేపీ–టీడీపీ కలిసి బరిలోకి దిగాయి. ఆ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా పార్థసారధి బరిలో నిలిచినప్పటికీ టీడీపీ రెబల్‌ అభ్యర్థి కారణంగా ఓటమిపాలయ్యారు. అయితే ఆ సందర్భంగా బీజేపీ శ్రేణులు మాత్రం టీడీపీ విజయం కోసం కృషి చేశాయి. 2004లో టీడీపీ ఓటమిపాలైంది. ఆ తర్వాత బీజేపీ–టీడీపీ మధ్య దూరం పెరిగింది. చంద్రబాబునాయుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. చివరకు ‘అనంత’లో పాదయాత్ర సమయంలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశామని, భవిష్యత్‌లో మళ్లీ పునరావృతం కానివ్వబోమని కూడా పలు వేదికలపై స్పష్టం చేశారు. దీనిపై అప్పట్లో బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తిరిగి 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ తిరిగి మైత్రీబంధం కొనాసాగించి కలిసి పోటీ చేశాయి. పొత్తులో భాగంగా గుంతకల్లు సీటు బీజేపీకి కేటాయించినా.. పొత్తు ధర్మాన్ని విస్మరించి టీడీపీ తమ అభ్యర్థి కూడా బరిలో నిలపడం గమనార్హం. అయినప్పటికీ బీజేపీ మిగతా స్థానాల్లో టీడీపీకే మద్దతివ్వడం గమనార్హం.

అవినీతిపై కూడా పెగలని గొంతు
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో కొందరు టీడీపీ నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. హంద్రీనీవా పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల్లో కూడా అవినీతి చోటు చేసుకుంది. అనంతపురం కార్పొరేషన్‌లో కూడా భారీగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే ఏ ఒక్క అవినీతి ఘటనపై బీజేపీ నేతలు నోరు మెదపలేదు. ‘అనంత’ అభివృద్ధి కోసం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ప్రశ్నించలేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ విషయంలో అన్యాయం జరుగుతున్న క్రమంలో, హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితుల్లోనూ నిర్లిప్తత ప్రదర్శించారు. వీటన్నింటికీ కారణం పొత్తే.

 అయితే ‘అనంత’కు తీవ్ర అన్యాయం జరుగుతున్నా బీజేపీ నేతలు స్పందించకపోవడంపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజకీయ లాభం కోసం నిమ్మకుండిపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇద్దరినీ ఒకే తీరుగా భావించారు. ఇది బీజేపీకి మరింత నష్టం చేకూర్చింది. ఈ విషయం బీజేపీ నేతలకూ స్పష్టంగా తెలుసు. దీనిపై ‘సాక్షి’ ఆరా తీస్తే టీడీపీ తీరు దారుణంగా ఉందని, దీనిపై స్పందించాలంటే మాకు పొత్తు అడ్డొస్తుందని.. టీడీపీతోనే తాము తీవ్రంగా నష్టపోతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా విష్ణువర్దన్‌రెడ్డి ఉన్నారు. అయినప్పటికీ జిల్లాలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బలపడని పరిస్థితి. ఈ క్రమంలో కనీసం రానున్న ఎన్నికల్లోనైనా గెలుపోటములను పక్కనపెట్టి బరిలో నిలవాలని బీజేపీ యోచిస్తోంది.

బీజేపీతోనే 12 స్థానాల్లో గెలుపు..
ప్రతి నియోజకవర్గంలో బీజేపీకి 4–5 శాతం తక్కువ లేకుండా ఓటు బ్యాంకు ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. 2014 ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. చాలా చోట్ల  వైఎస్సార్‌సీపీ నేతలు తక్కువ మెజార్టీతో ఓటమిపాలయ్యారు. ఇలాంటి స్థానాల్లో కచ్చితంగా బీజేపీ ప్రభావం ఉంటుందనేది రాజకీయపరిశీలకు వాదన. అయితే ఎన్నికల తర్వాత బీజేపీని టీడీపీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. కనీసం నియోజకవర్గాల్లో బీజేపీ నేతలకు ఏవైనా పనులున్నా టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోని పరిస్థితి. దీంతో బీజేపీ నేతలు టీడీపీ నేతల వైఖరిపై అంతర్గతంగా తీవ్రస్థాయిలో రగలిపోతున్నారు.

ఈ సారి పోటీలో ఉంటాం..
2009 ఎన్నికల్లో ఉరవకొండ మినహా అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో పోటీ చేశాం. 2014లో టీడీపీ పొత్తులో భాగంగా గుంతకల్లు నుంచి బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించి, తక్కిన స్థానాల్లో టీడీపీ గెలుపునకు కృషి చేశాం. కానీ టీడీపీ పొత్తు ధర్మాన్ని విస్మరించి జితేంద్రగౌడ్‌కు బీఫారం ఇచ్చింది. దీంతో మా అభ్యర్థి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉన్నా రెండు పార్లమెంట్‌ పరిధిలో ఒక్కో అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానం అడుగుతాం. పొత్తులో భాగంగా మూడున్నరేళ్లలో మేం నష్టపోయింది లేదు. మా వ్యూహం ప్రకారం బలపడ్డాం. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చినపుడు మేం ఎక్కడా రాజీపడలేదు. అంశాల వారీగా అవినీతిపై ప్రశ్నించాం.
– విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు,
బీజేపీ యువజన విభాగం

మరిన్ని వార్తలు