స్విచ్చేస్తే షాక్

24 Mar, 2015 01:28 IST|Sakshi
స్విచ్చేస్తే షాక్

విద్యుత్ వినియోగదారులకు చార్జీల మోత
 
జిల్లాపై నెలకు సగటున రూ.20 కోట్ల భారం
యూనిట్‌కు సగటున 5 నుంచి 7 శాతం చార్జీల పెంపు
చార్జీల పెంపుపై మండిపడుతున్న రాజకీయ పార్టీలు

 
విజయవాడ : వేసవికి విద్యుత్ చార్జీల భారం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న జిల్లా ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మరింత భారం మోపేందుకు నిర్ణయించింది. విద్యుత్ శాఖ అధికారులు చార్జీలు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించారు. యూనిట్‌కు సగటున 25 నుంచి 40 పైసల చొప్పున చార్జీలు పెంచారు. దీంతో జిల్లా వాసులపై సగటున రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. వ్యవసాయ కనెక్షన్లు, కుటీర , చక్కెర, పౌల్ట్రీ పరిశ్రమలకు మాత్రం చార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు.
 
గృహ వినియోగదారులపై చార్జీల మోత

సాధారణ గృహ కనెక్షన్లకు, హైటెన్షన్ కనెక్షన్లకు చార్జీలు పెరిగాయి. జిల్లాలో గృహ వినియోగదారులపై సగటున రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు అదనపు భారం పడగా, హెచ్ లైన్ వినియోగదారులకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు అదనపు భారం పడుతోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలకే విద్యుత్ చార్జీలు పెంచటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
 
జిల్లాలో విద్యుత్ వినియోగం ఇలా...

జిల్లాలో విద్యుత్ శాఖ  డివిజన్లు ఏడు ఉండగా, వాటి పరిధిలో 13 లక్షల 67 వేల 121 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో కేటగిరి-1 (గృహ వినియోగం)లో సుమారు 13.30 లక్షలు, కేటగిరి-2 (వాణిజ్య కనెక్షన్లు) 26 వేలు, కేటగిరి-3 (పరిశ్రమలు) 6 వేల కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిని విద్యుత్ శాఖ హెచ్‌టీ (హైటెన్షన్ లైన్), ఎల్ కనెక్షన్ (లోటెన్షన్ లైన్)గా విభజించి నెలవారీ విద్యుత్ వాడకానికి అనుగుణంగా ఆయా కేటగిరీలను బట్టి బిల్లులను నిర్ణయిస్తారు. ఈ క్రమంలో గత నెలలో జిల్లాలో మొత్తం విద్యుత్ బిల్లు డిమాండ్ రూ.360 కోట్లుగా ఉంది. ఏడాది మొత్తం సగటున రూ.330 కోట్ల నుంచి రూ.380 కోట్ల మధ్యలో విద్యుత్ బిల్లు డిమాండ్ వస్తోంది. దీనిలో గృహ వినియోగ కనెక్షన్లకు సంబంధించి రూ.170 కోట్ల నుంచి రూ.200 కోట్ల మధ్య బిల్లు డిమాండ్ రాగా, వాణిజ్య కనెక్షన్లు, పరిశ్రమలకు ఇచ్చే కనెక్షన్లు, హైటెన్షన్ కనెక్షన్లకు సంబంధించి రూ.160 కోట్ల నుంచి రూ.180 కోట్ల వరకు ఉంటుంది. గృహ కనెక్షన్లకు చార్జీల పెంపుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. గత నెలలో విద్యుత్ చార్జీల పెంపు యోచనలో భాగంగా విద్యుత్ శాఖ కొన్ని జిల్లాల్లో నిర్వహించిన బహిరంగ విచారణలో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
 
సగటు వినియోగం 200 యూనిట్ల పైనే

200 యూనిట్ల లోపు వారికి పెంచిన చార్జీలు వర్తించకపోయినా.. జిల్లాలో సాధారణ గృహాల్లో సగటు విద్యుత్ వినియోగం 200 యూనిట్ల పైనే ఉంటుంది. జిల్లాలో 13.30 లక్షల కనెక్షన్లలో 40 శాతం వినియోగదారులు 200 యూనిట్లు పైనే విద్యుత్ వినియోగించేవారే కావడం గమనార్హం. దీంతో చార్జీల పెంపు మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
 
భారాలు ఇలా...

విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటితే ఇప్పటివరకు యూనిట్‌కు రూ.6.38 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలు రూ.6.70కి పెరగనున్నాయి. 250 యూనిట్లు దాటితే రూ.6.88 గా ఉన్న యూనిట్ ధర 7.22కు పెంచుతూ నిర్ణయించారు. 300 యూనిట్లు దాటితే ఇప్పటివరకు రూ.7.38గా ఉన్న ధర రూ.7.75కు పెరగనుంది. 400 యూనిట్లు దాటితే ఇప్పటివరకు రూ.7.88గా ఉన్న ధర ఇప్పుడు రూ.8.27కి చేరుతుంది. 500 యూనిట్లు దాటితే రూ.8.38గా ఉన్న ధర రూ.8.80కి పెరుగుతుంది. విద్యుత్ శాఖ నష్టాలను భర్తీ చేసుకోవటానికి, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా స్వల్పంగానే చార్జీలను పెంచిందని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ మోహన్‌కృష్ణ ‘సాక్షి’కి తెలిపారు.
 

మరిన్ని వార్తలు