‘సింగపూర్‌’కే అనుకూలం

10 May, 2017 07:33 IST|Sakshi
‘సింగపూర్‌’కే అనుకూలం

కుండబద్దలు కొట్టిన  సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి

సాక్షి, అమరావతి: రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో ఏదీ సవ్యంగా సాగడం లేదని, ఇందులో పెద్ద కుంభకోణం దాగి ఉందని ప్రతిపక్షాలు, ప్రజాస్వామికవాదులు చేస్తున్న విమర్శలు సహేతుకమైనవేనని సాక్షాత్తూ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌ డీఏ) రుజువు చేసింది. స్విస్‌ చాలెంజ్‌ విధానమంతా సింగపూర్‌ సంస్థలకు బాసటగా, పూర్తిగా వాటికి లాభం చేకూర్చే పద్ధతిలో ఉందని సీఆర్‌డీఏ స్పష్టం చేసింది. రాజధాని స్టార్టప్‌ ప్రాజెక్టుకు సింగపూర్‌ కంపెనీలు ఇస్తామన్న రెవెన్యూ వాటాపై సంస్థ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సింగపూర్‌ కంపెనీలు స్విస్‌ చాలెంజ్‌లో చేసిన ప్రతి పాదనలను ప్రభుత్వం అంగీకరించడంతో సీఆర్‌డీఏకు, ప్రభుత్వానికి జరుగుతున్న నష్టాన్ని, ఎంపిక విధానంలో జరిగిన లోపాలను సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ స్పష్టంగా ఎత్తి చూపారు.
 
రెవెన్యూ వాటాల నిర్ధారణలో అన్యాయం

రాజధాని స్టార్ట్‌ అప్‌ ఏరియా అభివృద్ధికి స్విస్‌ చాలెంజ్‌ టెండర్‌లో సింగిల్‌ బిడ్‌  దాఖ లైనందున రెవెన్యూ వాటాల నిర్ధారణలో న్యాయం జరగలేదని, కౌంటర్‌ ప్రతిపాద నలు వచ్చి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో ఇటీవల ప్రభుత్వం ప్రైవేట్‌ విద్య, వైద్య సంస్థలకు ఎకరం రూ.50 లక్షల చొప్పున భూమిని కేటాయించిన విషయాన్ని అజయ్‌జైన్‌ గుర్తు చేశారు. కాగా రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో సింగపూర్‌ కంపెనీలకు 1,691 ఎకరాలను ఇవ్వగా.. ఆ కంపెనీలు ఎకరానికి కేవలం రూ.26.3 లక్షల చొప్పున 15 సంవత్సరాల్లో రూ.466 కోట్ల రెవెన్యూ షేర్‌ మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు