బిలియన్ డాలర్ల రుణమివ్వండి

2 Mar, 2016 11:54 IST|Sakshi

ప్రపంచ బ్యాంకును కోరిన సీఆర్‌డీఏ

సాక్షి, విజయవాడ బ్యూరో:  అమరావతి నిర్మాణానికి ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.6,700 కోట్లు) రుణమివ్వాల్సిందిగా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ప్రపంచ బ్యాంకును కోరింది. గతంలో ఈ మేరకు పంపిన ప్రతిపాదనపై ప్రాథమిక పరిశీలన నిమిత్తం ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం మంగళవారం విజయవాడ వచ్చింది. తొలుత సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌తో, ఆ తర్వాత సీఎం కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ టక్కర్‌తో చర్చలు జరిపింది.

రాజధానికి సంబంధించి సవివర నివేదికలను సాధ్యమైనంత త్వరగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు ఇవ్వాలని ఈ సందర్భంగా టక్కర్ సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు బృందం బుధవారం రాజధాని ప్రాంతంలో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకోనుంది. గురువారం సీఆర్‌డీఏ, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై రుణానికి సంబంధించి చర్చలు జరపనుంది. రుణానికి సంబంధించి కొద్దిరోజుల క్రితమే సీఆర్‌డీఏ ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదనలు సమర్పించింది.

రాజధానిలో వరద నియంత్రణ వ్యవస్థ, కాలువల వ్యవస్థ ఏర్పాటు, ఆర్టీరియల్-సబ్ ఆర్టీరియల్ రోడ్ల నిర్మాణం, సీవేజ్ ట్రీట్‌మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థల ఏర్పాటుతోపాటు రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ మొత్తాన్ని వినియోగిస్తామని పేర్కొంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలనలోనూ ఉంది. ప్రపంచ బ్యాంకును బిలియన్ డాలర్ల రుణం కోరినప్పటికీ.. ఇందులో 30 శాతం రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చే అవకాశం ఉందని సీఆర్‌డీఏ వర్గాలు పేర్కొన్నాయి.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు